బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా (ఎఫ్‌ఏసీ) ఎస్.బుల్లిరాణి నియమితురాల య్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె కాకినాడలోని కార్మిక శాఖ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె కొవ్వూరులో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఇటీవల జరిగిన పేలుడులో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కార్మిక శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ వల్లీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో బుల్లిరాణిని నియమించింది.
సెంట్రల్ జైలును
సందర్శించిన డీఎల్‌ఎస్‌ఏ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి సోమవారం సెంట్రల్ జైలును సందర్శించారు. ఖైదీలకు అందుతున్న ఆహార ప్రమాణాలు, సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా, బెయిల్ పిటిషన్లపై కోర్టులో అప్పీలు వేయాలన్నా డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచితంగా సేవలు పొందవచ్చని వారికి తెలిపారు. దీనికోసం పారాలీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు అందించాలన్నారు. ముద్దాయిలు, ఖైదీలు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలన్నారు.


