వడ్డీంచరేం? | - | Sakshi
Sakshi News home page

వడ్డీంచరేం?

Feb 6 2026 7:52 AM | Updated on Feb 6 2026 7:52 AM

వడ్డీ

వడ్డీంచరేం?

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు ఈ 18 నెలల కాలంలో ఇప్పటి వరకూ నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని దాదాపు లక్ష మంది రైతులు నష్టపోతున్నారు.

వడ్డీ రాయితీ ఇలా..

అన్నదాతలకు ఎంతో మేలు చేసే ఈ బృహత్తర పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తాను నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో పంట పెట్టుబడి కోసం రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు. అప్పటి వరకూ రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు. ఆ తరువాత రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తామని ప్రకటించారు. ఆవిధంగా రూపుదిద్దుకున్న ఈ పథకం కింద పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చొప్పున భరిస్తున్నాయి. ఉదాహరణకు ఒక రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే ఏడాది రూ.7 వేలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం రూ.3 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల చొప్పున చెల్లిస్తాయి. తద్వారా రైతుపై వడ్డీ భారం పడదు. ఈ సున్నా వడ్డీ పథకం రైతుకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రాయితీ అందించి, ఎంతో మేలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలును పూర్తిగా విస్మరించింది.

రైతుల పైనే వడ్డీ భారం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 50 సహకార బ్యాంకు బ్రాంచిలు, 295 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. వీటి పరిధిలో 2 లక్షల మందికి పైగా సభ్యులున్నారు. ప్రస్తుతం వీరికి ఏటా రూ.600 కోట్లకు తక్కువ కాకుండా రుణాలిస్తున్నారు. డీసీసీబీతో పాటు పలు వాణిజ్య బ్యాంకులు కూడా రైతులకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.3 లక్షల వరకూ పంట రుణాలిస్తున్నాయి. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడంతో వాణిజ్య బ్యాంకులతో పాటు సొసైటీల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి అసలుతో పాటు మొత్తం వడ్డీని కూడా రైతులే చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3 వేల చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.4 వేల వడ్డీ రాయితీని 18 నెలలుగా ఇవ్వడం లేదు. ఈవిధంగా ఉమ్మడి జిల్లాలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.200 కోట్ల మేర వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని సమాచారం. ప్రతి రైతూ దాదాపు రూ.8 వేల వరకూ నష్టపోవాల్సి వచ్చింది.

ఇతర పథకాల్లానే

ఎగనామం!

ఇప్పటికే రైతు సంక్షేమానికి దోహదపడే ఒక్కో పథకానికీ రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెడుతోందని, ఈ క్రమంలో సున్నా వడ్డీ పథకానికి కూడా పూర్తిగా ఎగనామం పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్‌ కో ఆర్భాటంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకానికి ఒక ఏడాది ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అరకొరగా రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. అది కూడా చాలా మంది రైతులకు ఇవ్వలేదు. అలాగే, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకూ పరిహారం చెల్లించలేదు. ఎప్పుడిస్తారనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇదే రీతిలో సున్నా వడ్డీ పథకానికి కూడా ఎగనామం పెడుతూండటంపై రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

వడ్డీ చెల్లించకుంటే

రుణం ప్రశ్నార్థకం

పంట రుణాలపై ప్రభుత్వం 18 నెలలు గా వడ్డీ రాయితీ ఇవ్వకపోవడంతో ఆ భారం రైతుల పైనే పడుతోంది. ప్రభు త్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే ఆ మొత్తా న్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ, వాణి జ్య బ్యాంకులతో పాటు సొసైటీలు కూడా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందు కు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నా యి. దీంతో, కొంత మంది రైతులు నానా తంటాలూ పడుతూ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తున్నారు. అలా చెల్లించలేని వారు తమకు పంట రుణాలు ఏవిధంగా వస్తాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.

పునరుద్ధరించాలి

ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతో పాటు, ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ, గత రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తూండటంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు.

– కరక అప్పలనాయుడు, రైతు, కేఈ చిన్నయ్యపాలెం,

కోటనందూరు మండలం

వెంటనే విడుదల చేయాలి

ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గత ఏడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి, గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.

– రావుల ప్రసాద్‌, కూరాడ, కరప మండలం

సున్నా వడ్డీకి ‘సున్నం’

సకాలంలో రుణాలు చెల్లించినా

పైసా విదల్చని సర్కారు

ఉమ్మడి జిల్లాలో

సుమారు లక్ష మంది రైతులకు నష్టం

సక్రమంగా తన వాటా ఇస్తున్న కేంద్రం

18 నెలలుగా

ఆ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వం

రైతులపై రూ.200 కోట్ల మేర భారం!

వడ్డీంచరేం?1
1/3

వడ్డీంచరేం?

వడ్డీంచరేం?2
2/3

వడ్డీంచరేం?

వడ్డీంచరేం?3
3/3

వడ్డీంచరేం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement