దండిగా హుండీ ఆదాయం
● సత్యదేవునికి రూ.1.83 కోట్ల రాబడి
● అన్నవరం దేవస్థానం చైర్మన్, ఈఓ వెల్లడి
అన్నవరం: సకల సంపదలకూ అధిష్టాన దేవత అయిన శ్రీమహాలక్ష్మి.. భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో ధనధార కురిపించింది. జనవరి నెలలో పెద్దగా భక్తులు రానప్పటికీ.. గడచిన 35 రోజులకు గాను స్వామివారికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,83,28,659 ఆదాయం సమకూరింది. దేవస్థానంలో హుండీలను గురువారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ.1,72,56,645, చిల్లర నాణేలు రూ.10,72,014 మేర లభించాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. వీటితో పాటు 11.5 గ్రాముల బంగారం, 625 గ్రాముల వెండి వస్తువులు లభించాయన్నారు. యుఎస్ డాలర్లు 157, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ దీనార్ ఒకటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు 30, సింగపూర్ డాలర్లు 14, సౌదీ రియల్స్ 111, ఆస్ట్రేలియా డాలర్లు 60, ఖతార్ రియల్స్ 10, కెనడా డాలర్లు 25, మలేషియా రింగిట్స్ 11, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్ క్యాట్స్ వెయ్యి, బ్యాంక్ ఆఫ్ కొరియా వాన్స్ 2 వేలు, స్కాట్లాండ్ పౌండ్లు 10, అంగోలా కరెన్సీ 500 క్వాంజాస్ లభించాయని తెలిపారు. మొత్తం 35 రోజులకు కలిపి హుండీల ద్వారా సగటున రోజుకు రూ.5,23,675 ఆదాయం లభించింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని జనవరిలో లెక్కించలేదు. జనవరిలో సంక్రాతి సెలవులు, మాఘ మాసంలో భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి తదితర పర్వదినాలు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో పెద్దగా భక్తులు రాలేదు. అయినప్పటికీ హుండీల్లో కానుకలు దండిగా రావడం విశేషం. ఆదాయం లెక్కింపులో చైర్మన్, ఈఓలతో పాటు డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.


