చా...ర్జ్!
అధిక చార్జీలు
వసూలు చేస్తే చర్యలు
సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు అధిక చార్జీలకు టిక్కెట్లు విక్రయించకూడదు. రవాణాశాఖ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి ముఖ్యమైన కూడళ్లలో బస్సులను ఆపి ప్రయాణికుల నుంచి టిక్కెట్ చార్జీల వివరాలను తెలుసుకుంటారని, ఏ ప్రాంతం నుంచైనా ప్రయాణికుల నుంచి నిర్దేశించిన చార్జీల కంటే అధిక ధరలకు విక్రయించినట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం.
– కె.శ్రీధర్, డీటీఓ, కాకినాడ
స్నేహితులతో
కారులో వస్తున్నాం
హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకు సొంతూరు వచ్చేందుకు కుటుంబమంతా బస్సులో బయలుదేరదామనుకున్నాం. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు రెండింతలు పెరిగిపోయాయి. కుటుంబమంతా కలిసి ఊరు రావడానికి రూ.15 వేలు పైనే అవుతుంది. రానూ, పోను బస్సు చార్జీలకే సుమారు రూ.30 వేలు అవుతోంది. ఇంత భరించలేక పొరుగున ఉన్న స్నేహితుల కుటుంబంతో కలిసి కారులో రావాలని నిర్ణయించుకున్నాం. కారులో రావడానికి రూ.10 వేలతో సరిపోతుంది.
– ఎన్.లావణ్య, హైదరాబాద్
చార్జీల మోత మోగించే వ్యవస్థలు రెండే రెండు. ఒకటి పోలీసు వ్యవస్థ.. రెండోది రవాణా వ్యవస్థలు. శాంతిభద్రలకు భంగం కలిగిస్తున్నారనో.. మరే కారణంగానో పోలీసులు చా..ర్జ్ అని అరిస్తే.. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని పండగలు.. పబ్బాలు.. వేసవి సెలవులు.. ఐదేళ్ల క్రితం కరోనా కష్టకాలమని కూడా చూడకుండా రవాణా సంస్థలు చా..ర్జ్ అని అరిచి భారీ దోపిడీలకు పాల్పడుతుంటాయి. పండగలు.. పుట్టిళ్లు.. బంధువర్గాల కలయికలు.. భావోద్వేగాలే ఆయా ఆపరేటర్ల పెట్టుబడి. రాకరాక వచ్చే సెలవులను అయినవాళ్లతో గడపాలని ఒకరు.. రాకరాక వచ్చే అవకాశాన్ని సొమ్ముచేసుకోవాలని మరొకరు.. వారి నడుమ నడ్డి విరిగి నలిగిపోతున్న సగటు జీతగాడి పరిస్థితి.. అతగాడు మాత్రమే కుటుంబ ప్రేమల మాటున జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నాడు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతికి సొంతూరు రావాలంటే జేబులు గుల్లవడం ఖాయం. బస్సులు, రైళ్లు సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి. పెద్ద పండగ సంక్రాంతి మూడు రోజులు సొంతూరులో సరాదాగా బంధువులతో గడుపుదామంటే టిక్కెట్ చార్జీలు గుండెలు గుభిల్లుమనిపిస్తున్నాయి. సంక్రాంతికి రెండు వారాల ముందే ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ మొదలైపోయింది. ఏ ట్రావెల్స్‌లో అడిగినా అడ్వాన్స్ బుకింగ్‌లు అయిపోయాయనే సమాధానం ఎదురవుతోంది. సహజంగా సంక్రాంతి పండగకు వారం రోజుల ముందు అంటే వారాంతం సెలవులు చూసుకుని ఈ నెల 9న ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిరుద్యోగుల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరకు, చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు జిల్లా వాసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే స్థిరపడ్డారు. హైదరాబాద్ తరువాత బెంగుళూరు, ఆ తరువాత స్థానంలో చైన్నె ఉంటాయి. అత్యధికులు హైదరాబాద్ నుంచే రావాల్సి ఉంది. వీరంతా సంక్రాంతి పండగకు పిల్లా పాపలతో కలసి వస్తుంటారు. ఇలా 20 వేల మంది వరకు జిల్లాకు వస్తుంటారని అంచనా. వీరిలో మూడు వంతుల మంది ఒక్క హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారే ఉంటారు. మిగిలిన వారు బెంగళూరు, చైన్నె, నెల్లూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వస్తారు.
ఏటా మాదిరిగానే ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలు బస్సు చార్జీలను రెండు నుంచి మూడింతలు పెంచేసి ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాదిగా వచ్చే వారితో బస్సులు, రైళ్లలో విపరీతమైన రద్దీ ఉంటాయి. టిక్కెట్టు చార్జి ఎంత పెంచినా అవసరాన్ని బట్టి తప్పడం లేదంటున్నారు. ప్రతి పండగకూ ప్రైవేటు బస్సులలో సీటుపై 10 నుంచి 15 శాతం పెంచుకోవడం సహజం. ఇందుకు ప్రయాణికులు కూడా మానసికంగా సిద్ధపడిపోయారు. ఈసారి సంక్రాంతి పండగకు 15 రోజుల ముందుగానే 60 నుంచి 80 శాతం వరకూ అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. ఏసీ, స్లీపర్ కోచ్‌లలో సీట్లను డబుల్ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఇవేం చార్జీలు అని అడుగుతుంటే వాహనాల తనిఖీలు, ఇతర ఖర్చులు భరించడం ఎలా అని ఎదురు ప్రశిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీల పెంచేస్తున్నా రవాణా శాఖ చూసీచూడనట్టు పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నుంచి కుటుంబం అంతా కలిసి బయలుదేరడమంటే రూ.15 వేల పై మాటగానే కనిపిస్తోంది. ఒక కుటుంబం రాను, పోను రూ.30 వేలు భరించడం మాటలా అంటున్నారు. పక్షం రోజుల క్రితమే సీట్లు ముందస్తు రిజర్వేషన్‌లు చేసుకున్నా చార్జీల మోత తప్పలేదని హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు చెబుతున్నారు. విమాన టిక్కెట్ ధరలతో పోటీ పడుతూ టిక్కెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఆర్టీసీ సర్వీసులు, రైళ్లు ఖాళీ లేక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.
సంక్రాంతికి ముందు వారాంతం శనివారం 10 తేదీ కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి రావడానికి ఆ రోజుకే ఎక్కువగా రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఆ రోజు ప్రైవేటు ట్రావెల్స్‌లో సీటు దొరకడమే గగనమైపోయింది. ఏ ట్రావెల్స్‌లో సీటు అడిగినా ఫుల్ అయిపోయాయి.. ఖాళీ లేవనే సమాధానం చెబుతున్నారు. సంక్రాంతి మూడు రోజులు 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ, వారాంతం శనివారం 17, ఆదివారం 18 వచ్చింది. జిల్లా నుంచి తిరుగు ప్రయాణానికి 18 తేదీకే డిమాండ్ ఎక్కువగా ఉంది. కారణాలేవైనా ఎక్కువ మంది ఆర్టీసీ కంటే ప్రైవేటు ట్రావెల్స్‌కే మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీలు పెంచేసి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. నలుగురు సభ్యులున్న కుటుంబం బస్సు ఎక్కాలంటే చార్జీలకు రూ.15 వేలు పెట్టుకోవాల్సి వస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు తిరుగు ప్రయాణానికి అప్పుడే అడ్వాన్స్ బుకింగులు పెరిగిపోయాయని, టిక్కెట్లు లేవని ట్రావెల్స్ నిర్వా హకులు చెప్పేస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ కాకినాడ–హైదరాబాద్ మధ్య ప్రతి రోజూ 30 బస్సులు నడు పుతున్నాయి. బెంగళూరు, చైన్నె వంటి ప్రాంతాలకు ఆరేడు సర్వీసులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా జిల్లా నుంచి ప్రతి రోజూ 1,500 నుంచి 2,000 మంది హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సంక్రాంతి సీజన్‌లో ఇంతకు ఆరేడు రెట్లు అదనంగా ప్రయాణిస్తుంటారు. సాధారణ రోజుల్లో ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలు నాన్ ఏసీ రూ.900, ఏసీ రూ.1,100, స్లీపర్ రూ.1,500 చార్జీలు ఉండేవి. సంక్రాంతి పండుగ పేరు చెప్పి నాన్ ఏసీ రూ.1,500 నుంచి రూ.2000, ఏసీకి రూ.2,500, స్లీపర్ రూ.3,500, అవకాశాన్ని బట్టి రూ.4000 వరకూ పెంచేశారు. ఇలా బస్సులు చార్జీలు చూసి రైళు ఎక్కుదామంటే అక్కడ కూడా బెర్త్‌లు నిండుకున్నాయంటున్నారు. సామర్లకోట జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే గౌతమి, గోదావరి సహా అన్ని రైళ్లలో ఈ నెల తొమ్మిది నుంచి 18 తేదీ వరకు దాదాపు రిజర్వేషన్లు క్లోజ్ అయిపోయాయి. ప్రత్యేక రైళ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రమే.
ప్రయాణికులపై పండగ మోత
ప్రభుత్వ ప్రజా రవాణా ఒకలా..
ప్రైవేటు ఆపరేటర్లు మరోలా..
రైళ్లు ఇంకొకలా బాదుడే బాదుడు
ఓ కుటుంబానికి రాను పోను
ప్రయాణ ఖర్చు రూ.30 వేల పైమాటే!
చా...ర్జ్!
చా...ర్జ్!
చా...ర్జ్!


