రత్నగిరి వనదుర్గ ఆలయంలో ఖడ్గమాల పూజ
● ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం
● ప్రతి శుక్రవారం నిర్వహణ
● టిక్కెట్ ధర రూ.1,116గా నిర్ణయం
అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని వనదుర్గ అమ్మవారి ఆలయంలో మరో కొత్త పూజకు శ్రీకారం చుడుతున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఖడ్గమాల స్తోత్రంతో శ్రీచక్రంపై కుంకుమపూజ నిర్వహించే కార్యక్రమాన్ని (ఖడ్గమాల పూజ) ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించనున్నట్లు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు శుక్రవారం తెలిపారు. వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 వరకూ ఈ పూజ జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు నిర్వహించే చండీహోమం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో నిర్వహించే ప్రత్యంగిర హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఖడ్గమాల పూజలకు టిక్కెట్ ధరను రూ.1,116గా నిర్ణయించారు. ఈ పూజలో భార్యాభర్తలు పాల్గొనవచ్చు.
విధి విధానాలపై చర్చ
ఖడ్గమాల పూజ విఽధి విధానాల రూపకల్పనపై పండితులతో చర్చిస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే ఖడ్గమాల పూజ మాదిరిగానే నలుచదరంగా ఉండే పలక మీద గల శ్రీచక్రానికి భక్తులతో పూజలు చేయించి, అనంతరం రాగి శ్రీచక్రం గల డాలర్, పూజ చేసిన కుంకుమ, ప్రసాదం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. శ్రీచక్రం గల పలకను దేవస్థానం వెనక్కి తీసుకుని మరో భక్తుని పూజలో ఉపయోగిస్తారు. అయితే దీనిపై దేవస్థానం ఆస్థాన సిద్దాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణ ప్రసాద్, ఆగమ సలహదారు త్రివేది కపిలవాయి రామశాస్త్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని దేవస్థానం అధికారులు తెలిపారు.
రత్నగిరి వనదుర్గ ఆలయంలో ఖడ్గమాల పూజ


