కోఢీ.. రెడీ! | - | Sakshi
Sakshi News home page

కోఢీ.. రెడీ!

Dec 26 2025 8:36 AM | Updated on Dec 26 2025 8:36 AM

కోఢీ.

కోఢీ.. రెడీ!

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి సంబరాలకు సమయం సమీపిస్తూండటంతో రూ.కోట్లు కొల్లగొట్టే కోడి పందేలకు నిర్వాహకులు ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు. బరుల కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారు. ఎక్కడెక్కడ బరులు ఏర్పాటు చేయాలి, పందేల నిర్వహణకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత ముట్టచెప్పాలనే దానిపై అంచనాలు వేసుకోవడంలో తలమునకలవుతున్నారు. బేరసారాలకు తలుపులు బార్లా తెరిచారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందేలు వేస్తే తోలు తీస్తామంటూ పోలీసులు భీకర హెచ్చరికలు చేస్తున్నా.. వాటిని నిర్వాహకులు షరా మామూలుగానే తేలికగా తీసుకుంటున్నారు. గత ఏడాది కంటే రెట్టింపు బరులు వేయాలనే పట్టుదలతో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మూడు పుంజులు.. ఆరు పందేలు

ఏటా సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. జిల్లాలోని జగ్గంపేట, గోకవరం, గండేపల్లి, తుని రూరల్‌, తొండంగి, పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప మండలాల్లో కోడి పందేలు యమ జోరుగా సాగుతూంటాయి. కోడి పందేల ముసుగులో గుండాట, నంబర్‌ లాటరీలకు కూడా ఈ మండలాలు పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడ సిటీ, రూరల్‌ సహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గంజాయి, పేకాట, సింగిల్‌ నంబర్‌ లాటరీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ నాటికి కోడి పందేలు నిర్వహించి తీరుతామని ఇప్పటికే నిర్వాహకులు చాలెంజ్‌లు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ‘మూడు పుంజులు.. ఆరు పందేలు’ అనే రీతిలో కోడిపందేలు నిర్వహించడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. పండగ పూట కోడికి కత్తి కట్టకుండా సరదాగా పందేలు వేసుకుంటే ఎటువంటి అభ్యంతరం ఉండదని, కత్తి కడితే మాత్రం పందేలను అడ్డుకుని తీరుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇప్పుడలానే అంటారని, పండగ దగ్గర చేసి ఈ మాటలేవీ చెల్లవని, ఏమైనా తేడా వస్తే తమ నాయకులే చూసుకుంటారని పందేల నిర్వాహకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులతో సైతం బేరసారాల్లో మునిగితేలుతున్నారు.

రోజుకు రూ.30 లక్షల మేర..

జిల్లాలో ఈసారి ప్రధానంగా కాకినాడ రూరల్‌, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలు కోడి పందేలకు కేరాఫ్‌గా నిలవనున్నాయి. ప్రతి బరిలో రోజుకు ఐదారు పెద్ద పందేలు, రెండు మూడు కొసరు పందేలు వేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఒక్కో బరిలో రోజుకు తక్కువలో తక్కువ రూ.30 లక్షల విలువైన కోడి పందేలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుందనే లెక్కలేస్తున్నారు. కాకినాడ రూరల్‌, కరప మండలాల్లో ఈసారి జనసేన గ్రామ స్థాయి నేతలు గ్రామాల వారీగా బరులు వేసే ఏర్పాట్లలో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మండలంలో విచ్చలవిడిగా జరిగిన పందేల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఈసారి కూడా ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత మాట తీసుకుని మరీ నిర్వాహకులు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులతో ద్వితీయ శ్రేణి నేతలు ముందస్తు మంతనాలు సాగిస్తున్నారు. జరిగే పందేలను బట్టి బరులకు రేట్లు నిర్ధారించాలనే నిర్ణయానికి వచ్చారు.

ముఖ్య నేతల కనుసన్నల్లో..

నిర్వాహకులు మారుతున్నారే తప్ప పందేలు మాత్రం ఎప్పటి మాదిరిగానే జరిపే ఏర్పాట్లలో ఉన్నారు. ఉదాహరణకు మండల కేంద్రమైన కరప, గురజనాపల్లి, గొర్రిపూడి, కొంగోడు, విజయరాయుడుపాలెం, వేళంగి, వేములవాడ గ్రామాల్లో గత ఏడాది వేసిన భారీ బరుల్లో రూ.లక్షలు చేతులు మారాయి. ఈసారి సంక్రాంతికి వేళంగి, గురజనాపల్లి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పందేలకు బరిలు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది గురజనాపల్లిలో నష్టం వచ్చిందనే కారణంతో ఈసారి నిర్వహించేందుకు వెనకడుగు వేశారని అంటున్నారు. కరపలో మాత్రం ఈసారి రెండు బరులు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్కో బరిలో గుండాట నిర్వాహకులు రూ.40 లక్షలకు తక్కువ కాకుండా ముట్టజెప్పేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెబుతున్నారు. ఇక్కడ జనసేనలో రెండు వర్గాలు రెండు బరులకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కరప – పెనుగుదురు మధ్య ఒక ప్రైవేట్‌ లే అవుట్‌లో బరి ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. కాకినాడ రూరల్‌ తిమ్మాపురం, సర్పవరం ప్రాంతాల్లో సైతం భారీ బరుల ఏర్పాటుకు బేరసారాలు కుదిరాయి. ఒక్కో బరికి రూ.30 లక్షల మేర ఒప్పందానికి వచ్చారని అంటున్నారు. అలాగే, తూరంగి, వాకలపూడి, వలసపాకలు, గొడారిగుంటల్లో ద్వితీయ శ్రేణి బరులు ఏర్పాటు చేసే పనిలో నిర్వాహకులున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్య నేతల కనుసన్నల్లోనే బేరసారాలు సాగుతూండటం విశేషం.

పందేలకు

పుంజులను

సిద్ధం చేస్తున్న

నిర్వాహకులు (ఫైల్‌)

బరిలో తలపడుతున్న పందెం పుంజులు (ఫైల్‌)

కాలు దువ్వుతున్న పందెం కోడి

పందెం బరులకు ముఖ్య నేతల కనుసన్నల్లో ఒప్పందాలు

జోరుగా బేరసారాలు

బరుల వేటలో పందెంరాయుళ్లు

ఆ మూడు నియోజకవర్గాలే కీలకం

కోఢీ.. రెడీ!1
1/1

కోఢీ.. రెడీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement