నేత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి
● రూ.170 కోట్ల బకాయిలు చెల్లించాలి
● ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నేత డిమాండ్
పిఠాపురం: నేత కార్మికులకిచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫెడరేషన్, చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యాన పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్కో ద్వారా గత ఆరేళ్ల నుంచి కొన్ని చేనేత సహకార సంఘాలకు, 12 సంవత్సరాల నుంచి మరికొన్నింటికి రావాల్సిన సుమారు రూ.170 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో నిలిచిపోయిన త్రిఫ్ట్ ఫండ్, నూలు సబ్సిడీ, 30 శాతం రిబేటు బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాల కొనుగోలును కొనసాగించాలని, పావలా వడ్డీ రుణ పథకం వెంటనే ప్రారంభించాలని, చేనేతలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.25 వేల నేతన్న భరోసా పథకాలను వెంటనే అమలు చేయాలని దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించి, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. బోగస్ చేనేత సొసైటీలపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతిలోగా వంద శాతం బకాయిలను ఆప్కో చెల్లించకుంటే చేనేత సహకార సంఘాలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 చేనేత కుల సంఘాలతో కలిపి రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అవసరమైతే ఆమరణ దీక్ష నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేనేతలకు, ప్రభుత్వానికి మధ్య అడ్డంకిగా మారిన హ్యాండ్లూమ్ కమిషనర్, ఆప్కో ఎండీ రేఖారాణిని వేరే శాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు, విలేకర్ల సమావేశంలో సీనియర్ చేనేత నాయకుడు కోమాకుల సత్యనారాయణ, చేనేత సహకార సంఘాల సీనియర్ నాయకుడు పడాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


