బాధితుడికి ఆర్థిక సాయం
కాకినాడ క్రైం: ‘నీ చేయి పని చేయదు.. పెన్షన్ రాద్దాంలే’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 16న ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. పెదపూడి మండలం కైకవోలు గ్రామానికి చెందిన 42 ఏళ్ల పెరుగుల వెంకట రమణ ఈ ఏడాది మార్చి 18న ద్విచక్ర వాహనం స్టాండ్ వేస్తూ పడిపోయాడు. ఈ ఘటనలో అతడి కుడి చేతికి గాయమైంది. కాకినా డ జీజీహెచ్ వైద్యులు అతడికి తొలుత కట్టు కట్టి, డిశ్చార్జి చేశారు. ఏప్రిల్ 7న శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచీ వెంకట రమణ కుడి చేయి మెల్లగా అచేతనంగా మారుతూ కదల్లేని స్థితికి చేరింది. సర్జరీ సమయంలో జీజీహెచ్ వైద్యులు మోచేతిలో బాల్ వంటి నిర్మాణం తీసేశారని ఓ ప్రైవేటు వైద్యుడు చెప్పడంతో తనకు జరిగిన అన్యాయంపై వెంకట రమణ ఈ నెల 8న జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడి ఆర్థోపెడిక్ వైద్యుడు శివానందం కూడా సర్జరీలో తేడా జరిగిందని, చేయి రాదని, కావాలంటే పెన్షన్ పెడదామని అన్నారు. దీనిపై బాధితుడు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో నేరుగా కలెక్టర్‌కు తన సమస్యను నివేదించాడు. దీనిపై ఈ నెల 16న ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించింది. దీని ద్వారా వెంకట రమణ కష్టం తెలుసుకుని విశ్రాంత డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ వి.శ్రీనివాసరావు చలించిపోయారు. అతడికి సామాజికవేత్త, కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు సాయంతో రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. కష్ట కాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
హిందువులు మౌనం వీడాలి
● ఇస్కాన్ దక్షిణ భారత డివిజినల్
కౌన్సిల్ పూర్వ చైర్మన్ సత్యగోపీనాథ్ దాస్
● భగవద్గీతను అర్థం చేసుకోవాలని పిలుపు
ఆలమూరు: హిందువులందరూ మౌనం వీడి సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజినల్ కౌన్సిల్ పూర్వపు చైర్మన్ పరవస్తు సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. మండలంలోని చెముడులంక రామాలయం వద్ద గురువారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ నాయకుల నుంచి ప్రతి ఒక్కరికీ హిందువులంటే అలుసుగా మారిందన్నారు. అవమానాలు చేసినా నోరు తెరవరని ఇతరులకు ధీమా ఏర్పడినందువల్లే తరచూ హిందూమతంపై దాడి జరుగుతోందన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారికి హిందువులు ఓట్లు వేయడం సిగ్గు చేటన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా అందరూ సంఘటితమై జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీదకు రావాలన్నారు. ధర్మాన్ని ఆచరించడం, భావితరాలకు అందించడం ద్వారా మాత్రమే హిందూ ధర్మ రక్షణ సాధ్యమవుతుందన్నారు. శ్రీమద్రామాయణం బాటలో మనం నడిచినంత కాలం సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ, మానవ సంబంధాలు ఉన్నతంగా వెలుగొందాయని చెప్పారు. పాశ్చాత్య సంస్కతిని అనుసరించడం మొదలుపెట్టాక సంఘంలోనే కాదు, కుటుంబాల్లో సైతం ఐక్యత దెబ్బ తిందన్నారు. గతంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తే నెల్లూరుకు చెందిన ముస్లిం యువకునికి మొదటి బహుమతి వచ్చిందన్నారు. తాను పోటీల కోసమే భగవద్గీత చదివానని అయితే భగవద్గీత మొత్తం చదివాక మొత్తం 700 శ్లోకాలలో ఎక్కడా మతం అన్న పదం లేదని, ఇది సర్వమానవాళికి ఉపయోగపడే సందేశంగా తెలుసుకున్నానని, మానవులు అందరూ భగవద్గీత చదవడం మొదలుపెడితే అశాంతి, కొట్లాటలు ఉండవని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకోలేక కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా నేడు ప్రవర్తిస్తున్నామని సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గోదావరి జిల్లా సహకార్యవాహ్ గెడ్డం రాంబాబు, వీహెచ్‌పీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి దూలం వెంకట గనిరాజు పాల్గొన్నారు.


