న్యాయం కావాలి
● మహిళా పోలీస్ స్టేషన్ ఎదుటే వివాహిత ధర్నా
● ఏడాదిన్నర బిడ్డతో నిరసన
● వదిలి వెళ్లిపోయిన భర్త నిర్వాకంపై ఫిర్యాదు
కాకినాడ క్రైం: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ ఏడాదిన్నర బిడ్డతో కలసి కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలపడం సంచలనం రేపింది. వివరాలివీ.. స్థానిక జగన్నాథపురానికి చెందిన మల్లాడి సునీత(24)కు కోటిపల్లికి చెందిన కార్పెంటర్ సూర్యప్రకాష్‌తో వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. అయితే, అదనపు కట్నం రూ.3 లక్షలు తేవాలంటూ భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సునీత ఏడాదిన్నర క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి నేటి వరకూ ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, తన భర్త నుంచి డబ్బులు తీసుకుని, రేపుమాపు, కౌన్సెలింగ్ అంటూ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని సునీత ఆరోపించింది. తన భర్త తరఫున రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారని, పోలీసులు కేసు నమోదు చేయకుండా వారు అడ్డు పడుతున్నారని వాపోయింది. తాను తల్లిదండ్రులు లేని అనాథనని, ఏ ఆధారమూ లేక, తినేందుకై నా గత్యంతరం లేని స్థితిలో చంటి బిడ్డతో బతుకుతున్నానని చెప్పింది. డబ్బు కోసం పోలీసులు తన జీవితంతో ఆడుకుంటున్నారని కన్నీటి పర్యంతమైంది. కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలనే డిమాండుతో సునీత నిరాహార దీక్షకు దిగి, గురువారం ఉదయం నుంచీ స్టేషన్ బయటనే బైఠాయించింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారని, తాను వెళ్లకపోవడంతో వారు తనను బలవంతంగా స్టేషన్‌లోకి లాక్కెళ్లారని చెప్పింది. చంటిబిడ్డతో ఉన్న తనను తీవ్రంగా బెదిరించారని, తన ఫోన్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించింది. తనను లాక్కెళ్లే క్రమంలో బిడ్డకు దెబ్బలు తగులుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని, కనీసం తనను వాష్ రూముకు కూడా పంపకుండా చిత్రహింసలకు గురి చేశారని సునీత చెప్పింది. తాను, తన బిడ్డ ఉదయం నుంచీ ఆహారం ముట్టుకోలేదని, తన బిడ్డ నీరసించి తల వెనక్కి వాల్చేస్తే భయపడి గట్టిగా ఏడ్చానని, బాబు పరిస్థితి చూసిన పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నామంటూ హడావుడి చేశారని తెలిపింది. తాను అక్కడి నుంచి బలవంతంగా బయటపడి తన బిడ్డను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లానని సునీత చెప్పింది. కాగా, గురువారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే సమయానికి సునీత తన బిడ్డతో స్టేషన్ నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు.


