పాటల పల్లకిలో లెక్కల పాఠాలు
● వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న మా‘స్టార్’
● రాగాలాపనతో చిక్కుముడులకు విడుపులు
● వి.సావరంలో నాగేశ్వరరావు ప్రతిభ
రాయవరం: విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడమే గురువు పరమ కర్తవ్యం. అందుకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. రాయవరం మండలం వి.సావరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు శైలి విభిన్నం. పాటతో గణితంలో పీటముడులు విప్పించడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం ఆకట్టుకున్న ఆయన శైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
గణితం గజిబిజి కాదంటూ
గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై విద్యార్థులు గజిబిజి అవుతుంటారు. వారు అలా అవస్థ పడకుండా ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతి పాఠాన్ని పేరడీ పాటలతో బోధిస్తూ లెక్కను సులువు చేస్తున్నారాయన. రోజా చిత్రంలోని పరువం వానగా.. అన్న పాటను రియల్ నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్‌గా పాడారు. అలాగే చిన్నారి తల్లి.. చిన్నారి తల్లి అనే పాటను సైన్ ఏ ఫ్లస్ బి ఈజ్ అంటూ పేరడీగా పాడారు. ఇలా ప్రతి గణిత పాఠానికి పేరడీ పాటలు సృష్టించి పిల్లల నోళ్లలో నానుతున్నారు.
సోషల్ మీడియాలోనూ
సోషల్ మీడియా ద్వారా కూడా నాగేశ్వరరావు తనదైన శైలిలో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ‘పాలెపు నాగేశ్వరరావు’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ఓపెన్ చేసి, దాని ద్వారా గణితం బోధిస్తున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా తన గణిత పాఠాలను అప్‌లోడ్ చేసి బోధిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది వీక్షకులు చూసినట్లు నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకు 72 వేల మంది ఇన్‌స్ర్ట్రాగామ్‌లో సభ్యులుగా ఉన్నారన్నారు. అలాగే తెలుగు సబ్జెక్టులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పద్య రత్నాల్లో 50 పద్యాలను తనదైన శైలిలో గానం చేసి ఆకట్టుకున్నారు. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్ పాఠ్యాంశాలపై చేసిన పేరడీలకు ఇన్‌స్టాలో 50 లక్షల వీక్షణలు రావడం గమనార్హం.
ఉన్నతాధికారుల నుంచి పిలుపు
సోషల్ మీడియా ద్వారా గణితాన్ని సులువుగా బోధిస్తున్న తీరును గుర్తించిన సమగ్ర శిక్షా రాష్ట్ర ఉన్నతాధికారులు నాగేశ్వరరావును ప్రత్యేకంగా విజయవాడకు ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విన్నూత్నంగా బోధిస్తున్న 41 మందిని బెస్ట్ ప్రాక్టీసెస్ వర్క్‌షాప్‌కు ఆహ్వానించగా, జిల్లాలోని మండపేట మండలం నుంచి అమలదాసు కావేరి, ఆలమూరు మండలం చింతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి వి.వెంకటేశ్వరరావు, రాయవరం మండలం వెదురుపాక నుంచి పి.నాగేశ్వరరావు ఉన్నారు. వర్క్‌షాప్‌లో నాగేశ్వరరావు కృషిని అభినందించి, ప్రశంసాపత్రాన్ని, వీడియోలు షూట్ చేయడానికి అవసరమైన పరికరాలను సమగ్ర శిక్షా రాష్ట్ర ఎస్‌పీడీ శ్రీనివాసరావు అందజేశారు.


