కోకపై పాశుర భాసురాలు!
చీరపై బొమ్మలు వేస్తున్న లీలా పూర్ణిమ
అమ్మవారికి సమర్పించిన చీరను
ప్రదర్శిస్తున్న లీలా పూర్ణిమ
● బొమ్మలతో కళాత్మకంగా అల్లిక
● ఉపాధ్యాయిని లీలా పూర్ణిమ ప్రతిభ
మామిడికుదురు: కళోపాసన ఆ భగవంతుని ప్రసాదం. చేతిలో కళ ఉండాలే కానీ దానిని వ్యక్తపరిచే ప్రతి చర్యలోనూ ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సందర్భోచితంగా తనలోని కుట్టు కళను అత్యంత సుందరంగా ఆవిష్కరించారు శ్రీఘాకోళపు లీలా పూర్ణిమ. మండలంలోని అప్పనపల్లికి చెందిన ఆమె ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ తీరిక సమయంలో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటారు. ధనుర్మాసం సందర్భంగా ఆమె గోదాదేవి తిరుప్పావై పాశురాలను చీరపై అత్యంత సుందరంగా అల్లి ఔరా అనిపించారు. పాశురాలతో పాటు చీరపై గోదాదేవి అమ్మవారి చిత్రం, నెమలి పింఛాలు, వెంకటేశుని నామాలు, వేణువు, కలువ పూలు, శంఖు, చక్రాలను రమణీయంగా కుట్టి తన ప్రతిభను చాటుకున్నారు. పది రోజుల పాటు 30 తిరుప్పావై పాశురాలు, 10 తిరుపుళ్లియ్యెచ్చి (శ్రీరంగనాథుని మేల్కొలుపు శ్లోకం) పాశురాలు, ప్రార్థనా శ్లోకాన్ని చీరపై అల్లారు. 1,493 పదాలను 320 వాక్యాల్లో అల్లినట్టు లీలా పూర్ణిమ తెలిపారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా అక్షరాల మధ్య సమతౌల్యం పాటిస్తూ చీరకు ప్రాణం పోసినట్లు అక్షరాలను, బొమ్మలను తీర్చిదిద్దారు.
పవిత్రతను చాటాలన్న లక్ష్యంతో..
సంక్రాంతి పండుగలో వచ్చే ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. దాని పవిత్రతను ప్రతి ఒక్కరికి చాటాలన్న లక్ష్యంతోనే పాశురాలు (శ్లోకాలు) రాశానని లీలా పూర్ణిమ తెలిపారు. నేటి తరం మరిచిపోతున్న లిపి కళను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పారు. భక్తి, సంప్రదాయం, సహనం, సృజనాత్మకతకు ప్రతి రూపంగా ఆమె అల్లిన శ్లోకాలు, బొమ్మలతో కూడిన చీరను అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి సమర్పించారు. ఆ చీరను అర్చకులు అమ్మవారికి అలంకరించి నిత్యం ‘తిరుప్పావై’ సేవ నిర్వహిస్తున్నారు.
కోకపై పాశుర భాసురాలు!


