ఇదేం భూగోతం | - | Sakshi
Sakshi News home page

ఇదేం భూగోతం

Aug 26 2025 8:00 AM | Updated on Aug 26 2025 8:00 AM

ఇదేం

ఇదేం భూగోతం

ఎకరా కన్వర్షన్‌కు

రూ.3 లక్షలు ఇవ్వాల్సిందే..

లేకుంటే నో పర్మిషన్‌

ముఖ్యనేతకు ముడుపుల మూట

సొంత పార్టీ అయినా ససేమిరా..

పేట్రేగిపోతున్న కూటమి నేతలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. తన, తమ భేదం లేకుండా ఎవరైనా పైసలు ఇవ్వందే పని కాదంటున్నారు. పై నుంచి కింది వరకు నేతలందరిదీ ఒకటే దారి అన్నట్టుగా ఉంది. మట్టి, గ్రావెల్‌, ఇసుక, లిక్కర్‌తోనే సరిపెట్టకుండా రియల్టర్లను కూడా విడిచిపెట్టడం లేదు. జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి నాలుగుపక్కలా ఉన్న కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో జనసేన నేతలు రియల్‌ దందా మూడు ప్లాట్‌లు, నాలుగు లే అవుట్‌లుగా నడుస్తోంది. లే అవుట్‌ వేయడమే పాపం అన్నట్టు లక్షలు మెక్కేస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పెట్టి సొమ్ములు ఇస్తేనే సై అంటున్నారు. అన్నంత ఇవ్వకుంటే లే అవుట్లను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలను సైతం విడిచిపెట్టడం లేదు. కాకినాడ రూరల్‌, కరప మండలాల్లో జరుగుతోన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నియోజకరవర్గ ముఖ్యనేతకు కాసులు కురిపిస్తోంది. చివరకు సొంత వ్యవసాయ భూమిని ప్లాట్‌లుగా అమ్ముకుందామన్నా కూడా కప్పం కట్టాల్సిందేనని పంతం పట్టిమరీ వసూళ్లకు తెగబడుతున్నారు. ఈ రియల్‌ దందా అంతా కాకినాడ పరిసర ప్రాంతాల్లో సినిమాటిక్‌గా జరుగుతోంది.

కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కౌడా) పరిధిలోకి వచ్చే రూరల్‌ నియోజకవర్గం లే అవుట్లకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం అటు కోనసీమ, ఇటు తూర్పుగోదావరి జిల్లాల్లోని నగరాలు, పల్లెల నుంచి కాకినాడ నగరానికి వలసలు పెరుగుతూ వస్తున్నాయి. ఏటా పెరుగుతూ వస్తున్న నగర జనాభా ప్రస్తుతం నాలుగున్నర లక్షల పైమాటే. వలసలు వచ్చే కుటుంబాలతో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు కాకినాడ నగరంలో నివాసం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ నగరానికి ఆనుకుని ఆరేడు కిలోమీటర్ల వరకు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి.

ఈ భూములను రియల్టర్లు కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. ఎకరాల్లో భూములు కొనుగోలు చేసి లేఅవుట్‌లు చేసి గజాల్లో విక్రయిస్తున్నారు. ఈ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేసే సమయంలో నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు ఆ భూముల్లో గద్దల్లా వాలిపోతున్నారు. రియల్టర్లతో బేరసారాలకు తెరతీస్తున్నారు. అనుకున్నట్టు గానే పంతం పట్టి కప్పం కట్టించుకుంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు నిర్ణయించి జనసేన నేతలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. అది సొంత పార్టీ అయినా.. కూటమి నేతలైనా నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు మాత్రం విడిచిపెట్టడం లేదు. లే అవుట్‌ వేస్తే కప్పం కట్టాల్సిందేనంటున్నారు. లేదంటే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి భూ బదలాయింపు (కన్వర్షన్‌)కు అనుమతులు ఆపేస్తున్నారు. మండల కేంద్రమైన కరప, పెనుగుదురు, నడకుదురు, కాకినాడ రూరల్‌ తూరంగి, చీడిగ, కొవ్వాడ, సర్పవరం, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో వేస్తున్న వెంచర్లలో ఎకరాకు రూ.3 లక్షల వంతున బలవంతపు వసూళ్లకు తెగబడుతున్నారు.

నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లోనే ఈ రియల్‌ దందా అంతా సాగుతోంది. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో అతని అనుచరులు బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల మండల కేంద్రం కరపలో జనసేన నాయకుడు వేసిన లే అవుట్‌ను కూడా విడిచి పెట్టలేదు. ఒకప్పుడు అన్నవరం దేవస్థానం సభ్యుడిగా పనిచేసిన ఆ నాయకుడు తాను జనసేనకే పనిచేశానని, ఆ భూమి తన సొంతమని ఎంత మొత్తుకున్నా జనసేన నేతలు పెడచెవిన పెట్టారు. 26 ఎకరాల లే అవుట్‌లో ఎకరాకు రూ.3 లక్షలు వంతున కప్పం కట్టాలని పంతం పట్టారు. ఇందుకు ఆ నాయకుడు ససేమిరా అనడంతో అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి లేఅవుట్‌లో మెరకచేసే పనులను ఆపేయించారు. రెండు వారాల పాటు పనులు ఆపేసిన సంబంధిత రియల్టర్‌ కం జనసేన ఫాలోవర్‌ చివరకు చేసేదేమీ లేక వారు పంతం పట్టినంతా కప్పం కట్టేసి నిలిచిపోయిన లే అవుట్‌ పనులు మొదలుపెట్టారు. ఆ ఒక్క లే అవుట్‌లోనే సుమారు అరకోటి ముడుపు మూటకట్టి నియోజకవర్గ ముఖ్యనేతకు చెల్లించుకున్నారు. ఇదే విషయం ఇటీవల కరప మండలంలో జరిగిన తేదేపా మండల స్థాయి నేతల సమావేశంలో చర్చకు రావడం గమనార్హం. సొంత పార్టీ వారు లే అవుట్‌లు వేసుకున్నా వదలకుండా జలగల్లా పట్టి పీడించుకు తింటే ఎలా అని తేదేపా సీనియర్‌ నేతలు నిలదీశారని తెలియవచ్చింది.

ఎక్కడైనా లే అవుట్‌ వేస్తున్నారంటే ముందుగానే ఎకరాకు రూ.3 లక్షలు ఇస్తామనే ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌ ముడుపు ముట్టజెప్పాల్సిందే. ముఖ్యనేత చేతిలో సొమ్ము పడితేనే లే అవుట్‌కు అధికారులు అనుమతుల ప్రక్రియ మొదలుపెడతా రు. నియోజకవర్గమంతటా ఇదే దందా నడుస్తోంది. కాకినాడ రూరల్‌ తూరంగి, చీడిగ, కొవ్వాడ, గంగనాపల్లి, పండూరు, పి.వెంకటాపురం, పెనుమర్తి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో సైతం ఇదే తరహా రియల్‌ దందా నడుస్తోంది. ఎకరాకు వసూలు చేస్తున్న కప్పం రూ.3 లక్షల్లో రెండు వంతులు అంటే రెండు లక్షలు నియోజకవర్గ ముఖ్యనేతకు మిగిలింది స్థానిక నేతలు పంచుకుంటున్నారు. ఈ ముడుపులు చెల్లించలేక రియల్టర్‌లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం వస్తే ఏదో నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చనే ఆశ అడియాశ చేశారని రియల్టర్లుగా మారిన కూటమి నేతలు మండిపడుతున్నారు. తమ ప్రభుత్వం వచ్చిందనే సంతోషం కూడా లేకుండా చేశారంటున్నారు. కనీసం తమకై నా మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌ కూటమి సమావేశం ముందుంచాలని రియల్టర్లు అయిన కూటమి నేతలు సిద్ధపడుతున్నారు.

ఇదేం భూగోతం1
1/1

ఇదేం భూగోతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement