విద్యాభంగం | - | Sakshi
Sakshi News home page

విద్యాభంగం

Aug 24 2025 8:24 AM | Updated on Aug 24 2025 8:24 AM

విద్య

విద్యాభంగం

విద్యార్థుల ఫీజుల మాటేమిటి

బాకా బాబు..!

కాలేజీకి వెళ్లేదెలా.. చదువులు సాగేదెలా?

గుదిబండగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌

అప్పులు చేసి కడుతున్న తల్లిదండ్రులు

బకాయిలు రూ.వంద కోట్లు పైమాటే..

విద్యార్థులు 41,413 మంది

ఎదురుచూపులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు సర్కార్‌ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా మొండిచేయి చూపిస్తోంది. బకాయిలు రూ.కోట్లలో ఉన్నా చిల్లిగవ్వ కూడా విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డున పడేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము విడుదల చేయకుండా చంద్రబాబు సర్కార్‌ విద్యార్థులకు నరకం చూపిస్తోంది. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు పెడుతున్న షరతులతో కాలేజీలకు వెళ్లేదెలా అంటూ విద్యార్థులు కంటతడి పెడుతున్నారు. ఫీజులు చెల్లించాకే కాలేజీలకు రండి అని యాజమాన్యాల ఒత్తిళ్లతో విద్యార్థులు దిక్కులు చూసే పరిస్థితి ఎదురవుతోంది. కాలేజీ యాజమాన్యాలు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ సొమ్ము విడుదల కాకపోవడంతో కాలేజీలు నడపలేకపోతున్నామని మథనపడుతున్నారు. చంద్రబాబు ఒంటెద్దు పోకడలతో పరిస్థితి ఇలానే కొనసాగితే, కాలేజీలు మూతపడే దుస్థితి ఏర్పడుతుందని కాలేజీ యాజమాన్య ప్రతినిధులు మండిపడుతున్నారు. మొత్తం విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి ఒక్క త్రైమాసికానికి చెల్లించి, మిగిలిన మూడు త్రైమాసికాలు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. కాగా గత విద్యా సంవత్సరానికి మూడు త్రైమాసికాలు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యార్థులు నేరుగా చెల్లించిన ఫీజులపై సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇదంతా లెక్కిస్తే.. దాదాపు రూ.వంద కోట్లు పైమాటే ఉంటుందని అంచనా.

విద్యార్థులపై ఒత్తిళ్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత కరవవ్వడంతో పేద, మధ్య తరగతి వర్గాలవారు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్‌, మిడ్‌ పరీక్షలు వచ్చిన ప్రతి సందర్భంలోను ఫీజుల కోసం కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. మొత్తం ఫీజులు చెల్లించకున్నా, కనీసం సగం ఫీజైనా చెల్లిస్తేనే పరీక్ష రాయిస్తామని కాలేజీలు షరతులు పెడుతున్నాయి. ఇలా ఒకేసారి రూ.50 వేల నుంచి రూ.65 వేలు చెల్లించాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది. ఓ వైపు కాలేజీల ఒత్తిళ్లతో కొందరైతే అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు.

ఉత్తుత్తి ఉత్తర్వులు

ఇంజినీరింగ్‌, డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాల్సి ఉంది. గడచిన ఏడాది కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేస్తున్నట్టు రెండు పర్యాయాలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు చూసి ఇంకేముంది సొమ్ములు ఖాతాలకు వచ్చిపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు గంపెడాశతో ఎదురుచూశాయి. తీరా అవన్నీ చంద్రబాబు హామీల మాదిరిగానే ఉత్తుత్తి ఉత్వర్వులుగానే మిగిలిపోయాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు మాత్రం విడుదల చేయలేదు.

విద్యార్థుల అవస్థలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు పూర్తి బకాయి చెల్లించి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ పొందాలని విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఫీజు చెల్లించకపోతే సర్టిఫికెట్‌ ఇచ్చేది లేదని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు షరతులు పెడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయి విద్య లేదా డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు పొందిన వారు సొంతంగా ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లండి అని యాజమాన్యాలు చెబుతుండటంతో విద్యార్థులు నరకం చూస్తున్నారు.

కాకినాడలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో బీసీఏ కోర్సు అభ్యసించిన విద్యార్థి కలగల సత్తిబాబు(పేరు మార్చాం)కి ఏడాదికి రూ.18 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లించగా, ఈ విద్యా సంవత్సరంలో చెల్లించలేదు. ఐసెట్‌లో అర్హత సాధించి, ఎంసీఏ కోర్స్‌ చేయడానికి సర్టిఫికెట్లు అవసరం కావడంతో, సొంతంగా ఫీజు చెల్లించి సర్టిఫికెట్‌ తీసుకున్నాడు. అదేవిధంగా జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థికి సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం రావడంతో సంబంధిత కంపెనీ సర్టిఫికెట్లు అడగడంతో, ఫీజు మొత్తం చెల్లించి ఉద్యోగంలో చేరాడు. ఇలా విద్య, ఉద్యోగాలకు విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఓవైపు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేశాక చెల్లిస్తామని విద్యార్థుల నుంచి అంగీకార పత్రం తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేయమని ఆదేశాలిస్తున్నా.. వాటిని యాజమాన్యాలు ఏమాత్రం పాటించడం లేదు.

పథకాలు ఇవ్వలేక..

కళ్లబొల్లి మాటలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసింది తప్పితే.. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అందించిన పథకాలను ఇవ్వలేక చేతులెత్తేసింది. అప్పుడే అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిపోయినా, ఇప్పటికే మూడు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చింది. ఇలా రూ.కోట్లలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు పూర్తిగా నిలిపివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారంలోకి వస్తే అంతకుమించి ఇస్తామని గొప్పలకు పోయిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక ఆ విషయాన్ని గాల్లో కలిపేశారని వారు మండిపడుతున్నారు.

కాకినాడ జిల్లా 2024–25 ఎ.వై. పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ విడుదల చేసిన వివరాలు

కులాల వారీగా.. స్టూడెంట్స్‌ ఆర్‌టీఎఫ్‌ మొత్తం స్టూడెంట్స్‌ ఎంటీఎఫ్‌ మొత్తం ఆర్‌టీఎఫ్‌ పెండింగ్‌

ఎస్సీ 6,106 6,09,49,165 5,478 1,08,58,800 0

ఎస్టీ 295 59,74,115 174 7,87,900 0

క్రీస్టియన్‌ మైనార్టీ 100 15,88,127 0 0 14,00,000

ముస్లిం మైనార్టీ 559 76,37,565 0 0 68,00,000

బీసీ 19,557 25,47,49,771 0 0 21,00,00,000

ఈబీసీ 2,372 4,01,40,833 0 0 3,00,00,000

కాపు 12,424 17,33,52,429 0 0 12,00,00,000

మొత్తం 41,413 54,43,92,005 5,652 1,16,46,700 33,82,00,000 (36,82,00,000)

నోట్‌: రీయింబర్స్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు (ఆర్‌టీఎఫ్‌), ఎంటీఎఫ్‌ (మెయింటెనెన్స్‌ ఫీజు)

ఇది వరకు క్రమం తప్పకుండా వచ్చేది

నేను ప్రత్తిపాడు నైపుణ్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాను. బీఎస్సీ ఫస్టియర్‌ పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి వచ్చాను. నాకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జమ కావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పటికీ పడలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడే నేను కళాశాలలో జాయిన్‌ అయ్యాను. రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము పడకపోవడంతో ఫీజు అడుగుతున్నారు. ఫీజు చెల్లించకపోయినా యాజమాన్యం దయతో నన్ను కొనసాగిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము జమ చేయాలి.

– ద్విభాస్యం ఝాన్సీ ఉమామహేశ్వరి, ప్రత్తిపాడు

ఆఖరి ఏడాది రీయింబర్స్‌మెంట్‌ రాలేదు

సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవారం. కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022–25 మధ్య డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ ఆఖరి ఏడాదికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలలో ఉండిపోయాయి. ఫీజు పూర్తిగా చెల్లించిన తరువాతే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఏపీ పీజీ సెట్‌లో అర్హత సాధించాను. ఉన్నత విద్య అభ్యసించాలన్నా, ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా డిగ్రీ ప్రొవిజనల్‌ అడుగుతున్నారు. డబ్బు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి నాది.

– మణి శివసంజయ్‌, కాకినాడ

ఇదే నా చదువుకు ఆధారం

మాది పెద్దాపురం మండలం మర్లావ గ్రామం. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబం మాది. తండ్రి సూర్యప్రకాష్‌ కష్టపడి నన్ను ఇంజినీరింగ్‌ చదివిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడే చదువుకున్నాను. అప్పుడు ఏ ఇబ్బందీ ఎదురుకాలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో విడతల వారీగా విడుదల కావడంతో కాలేజీల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు ఎదురవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇంతవరకు ఫీజుల సొమ్ము విడుదల చేయకపోవడంతో కాలేజీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి మా లాంటి రైతు కుటుంబాలను ఆదుకోవాలి. – జగటపు శివరామకృష్ణ, మర్లావ, పెద్దాపురం

విద్యాభంగం1
1/4

విద్యాభంగం

విద్యాభంగం2
2/4

విద్యాభంగం

విద్యాభంగం3
3/4

విద్యాభంగం

విద్యాభంగం4
4/4

విద్యాభంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement