
ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి
జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల వినతి
సామర్లకోట: రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా చెల్లించాలని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడు సలాది సాయిసత్యనారాయణ అన్నారు. శనివారం ముఖ్యమంత్రి పెద్దాపురం నియోజకవర్గ పర్యటనను పురస్కరించుకుని ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో వినతిపత్రం అందజేసినట్టు ఆయన విలేకర్లకు తెలిపారు. గ్రంథాలయాల ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా చెల్లించడం వల్ల సకాలంలో జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 600 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా జీతాలు, పెన్షన్లు అందజేయాలని కోరామన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఈ.వెంకట్రావు పాల్గొన్నారు.
ప్రజలకు చేరువగా
పంచాయతీరాజ్ వ్యవస్థ
రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి
వెంకటకృష్ణ
సామర్లకోట: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ప్రజలకు మరింత చేరువగా, పారదర్శంగా మార్చడానికి ఉద్యోగులు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కె.వెంకటకృష్ణ అన్నారు. బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తి విస్తరణ శిక్షణ కేంద్రాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో గత నెల 28 నుంచి ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలు శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసి, గ్రామాలు, మండలాల పాలనలో మార్పు తేవాలన్నారు. అప్పుడే ప్రజల అభివృద్ధి, ఉద్యోగులకు సంతృఫ్తి కలుగుతుందన్నారు. స్వర్ణ పంచాయతీ, మేరీ పంచాయతీ యాప్‌ల ద్వారా పంచాయతీ రాబడి, ఖర్చులను ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు. పంచాయతీ సంస్థలను ప్రజలకు అందుబాటులో ఉంచి, వారి అభివృద్ధి, సంక్షేమానికి సంస్కరణలు తీసుకువస్తున్నట్టు వివరించారు. భవిషత్తులో శిక్షణలు తప్పనిసరి చేస్తూ ఉద్యోగ నియమావళిలో మార్పు తెస్తామని తెలిపారు. స్థానిక ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు శేషుబాబు, శర్మ, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వికాసలో రేపు జాబ్‌మేళా
కాకినాడ సిటీ: వికాస ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు శనివారం తెలిపారు. బజాజ్ క్యాపిటల్‌లో ఫైనాన్షియల్ అడ్వయిజర్, టెలికాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వెంకీ రెసిడెన్సీలో స్టీవర్డ్, కెప్టెన్, టెక్నీషియన్, ఐసాన్ ఎక్స్‌పీరియన్సెస్ కంపెనీలో టెలి సేల్స్ రిప్రజెంటేటివ్, డెక్కన్ కెమికల్స్‌లో ట్రైనీ(మెకానికల్ మెయిన్‌టెనెన్స్), జూనియర్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్, కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఇసుజు, వియాష్ లైఫ్ సైన్సెస్, ఇంజి, డిక్సాన్, హ్యుండాయ్ మోబీస్ కంపెనీల్లో టెక్నీషియన్, ఫాక్స్‌కాన్ కంపెనీలో ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఎస్‌ఎస్‌స్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్‌లో ఉత్తీర్ణులై, 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. అభ్యర్థులు సోమవారం వికాస కార్యాలయానికి ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల కాపీలతో హాజరుకావాలన్నారు.

ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి