
సత్యదేవుని సన్నిధి.. వరాల పెన్నిధి
● ఘనంగా స్వామివారి జన్మ నక్షత్ర పూజలు
● యాగశాలలో ఆయుష్య హోమం
● ఆలయాన్ని దర్శించిన 20 వేల మంది
● దేవస్థాన ఆదాయం రూ.25 లక్షలు
అన్నవరం: స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరిచి, స్వామి, అమ్మవార్లకు అర్చకస్వాములు సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్‌లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలు తదితర పంచామృతాలతో మహాన్యాశ పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ భరిత పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఏడు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
ఘనంగా ఆయుష్య హోమం
యాగశాలలో ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్యహోమం ఘనంగా జరిగింది. 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్, గంగాధరభట్ల శ్రీనివాస్, వేద పండితులు గొల్లపల్లి ఘనపాటి, చిట్టి శివ, ఉపాధ్యాయుల రమేష్, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు.
స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
శనివారం పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పండితులు పూజలు చేశారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చారు. ఇలాఉండగా శనివారం సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం సౌకర్యం కల్పించారు.

సత్యదేవుని సన్నిధి.. వరాల పెన్నిధి