
జిల్లాలో 40.2 మి.మీ వర్షపాతం
కాకినాడ సిటీ: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు సరాసరి 40.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తొండంగి మండలంలో 55.2, అత్యల్పంగా పెదపూడి మండలంలో 22.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా శంఖవరంలో 54.2, గొల్లప్రోలు 52.2, పిఠాపురం 51.6 కోటనందూరు 50.2, యు.కొత్తపల్లి 50.2, తుని 49.6, రౌతులపూడి 48.2, కిర్లంపూడి 46.2, ఏలేశ్వరం 45.2, ప్రత్తిపాడు 42.4, కాకినాడ రూరల్ 34.6, సామర్లకోట 34, జగ్గంపేట 32.6, పెద్దాపురం 32.2, కాజులూరు 31.2, తాళ్లరేవు 29.8, కాకినాడ అర్బన్ 29.4, కరప 29.2, గండేపల్లి 23.4, పెదపూడి 22.4 మిల్లీమీటర్లు చొప్పున కురిసింది.
‘తాండవ’లో జలకళ
కోటనందూరు: తాండవ జలాశయం నీటితో కళకళలాడుతోంది. రెండు, మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షానికి నీటి నిల్వలు పెరుగుతున్నాయి. జలాశయం గరిష్ట నీటి మట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 375.5 అడుగులకు నీరు చేరినట్టు డీఈఈ అనురాధ తెలిపారు. నీటిమట్టం 378 అడుగులకు చేరితే ఆ తర్వాత వచ్చే ఇన్‌ఫ్లోకు అనుగుణంగా సముద్రంలోని నీటిని విడిచిపెడతామన్నారు.
భక్తులతో రత్నగిరి కిటకిట
అన్నవరం: సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలి వచ్చిన నవ దంపతులు, భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత మండపాలు నిండిపోయాయి. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున ముహూర్తాలలో రత్నగిరిపై సుమారు 50 వివాహాలు జరిగాయి. ఇతర ప్రాంతాలలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో వారంతా తమ బంధువులతో కలిసి సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారని, 2,200 వ్రతాలు జరిగాయని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం వచ్చింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు.

జిల్లాలో 40.2 మి.మీ వర్షపాతం