కోకో కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు
అంబాజీపేట: ఆరుగాలం శ్రమించి పండించిన కోకో గింజలను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర కోకో సాగురైతు సంఘ సహాయ కార్యదర్శి కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ అన్నారు. అంబాజీపేట కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కార్యాలయంలో జిల్లా కోకో రైతుల సమావేశం జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద వెంకటప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నచ్చిన ధరలకు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కోకో గింజలు నాణ్యత ఉన్నప్పటికీ సరైన ధర లేకపోవడం, విక్రయాలు జరగకపోవడంతో కోకో రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. కోకో గింజలకు ప్రస్తుతం అంతర్జాతీయ ధర కిలో రూ.940లు ఉండగా ప్రైవేట్ వ్యక్తులు కిలో రూ.500లోపు కొంటున్నారన్నారు. అంతర్జాతీయ ధరకే కోకో గింజలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విదేశీ గింజల దిగుమతులు నిలుపుదల చెయ్యాలని, ధరలు నిర్ణయించే వరకూ రైతులు, కంపెనీలు కొనుగోలు, అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే కోకో రైతులను ఆదుకునేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోకో గింజల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కోకో రైతుల సంఘ అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతులు దంగేటి గిరిధర్, అడబాల రాజమోహన్, రెడ్డి రామకృష్ణ, అయ్యగారి శ్రీనివాస్, సరెళ్ల అప్పారావు, ప్రకాష్, సమయవంతుల పండు తదితరులు పాల్గొన్నారు.


