నేర నామ సంవత్సరం | - | Sakshi
Sakshi News home page

నేర నామ సంవత్సరం

Dec 30 2025 7:45 AM | Updated on Dec 30 2025 7:45 AM

నేర న

నేర నామ సంవత్సరం

గంజాయి బ్యాచ్‌ల స్వైరవిహారం

గంజాయిని అరికడతామంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పడం మినహా.. వాస్తవానికి ఈ మత్తు ఈ ఏడాది మరింత ఎక్కువగా పట్టణాలతో పాటు పల్లెల్లోకీ విస్తరిస్తోంది. జిల్లా కేంద్రమైన కాకినాడలో అయితే గంజాయి లభించని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. గంజాయి ముఠాలు విద్యార్థులను ఈ మత్తులో ముంచుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. టన్నులకొద్దీ గంజాయిని పోలీసులు పట్టుకుంటున్నా.. అనేక మందిని అరెస్టు చేస్తున్నా.. అవేవీ ఈ మత్తును నియంత్రించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పైగా గంజాయి ముఠాలు బరితెగించి నడి రోడ్డుపై వీరంగం వేస్తూండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాకినాడ రామారావుపేటలో ఈ ఏడాది అక్టోబర్‌లో రాత్రి విధులు ముగించుకొని వస్తున్న ఓ వైద్యుడిపై ముగ్గురు గంజాయి నిందితులు దాడి చేసి డబ్బులు లాక్కున్నారు. స్నేహితుడు సకాలంలో స్పందించడంతో వైద్యుడికి ముప్పు తప్పింది. అప్పటికి కొద్ది రోజుల ముందు మల్లయ్య అగ్రహారం సమీపాన ఓ విలేకరిపై గంజాయి మత్తులో ఉన్న మైనర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ విలేకరి చావు అంచుల వరకూ వెళ్లొచ్చాడు. ఇక చైన్‌స్నాచర్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. దోపిడీ దొంగలు చెలరేగిపోతూండటం ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.

కాకినాడ క్రైం: జిల్లా ప్రజలకు 2025 సంవత్సరం చేదు అనుభవాలను చవిచూపింది. అనుకోని ప్రమాదాలు కొన్ని.. అనుకొని చేసిన దారుణాలు ఇంకొన్ని.. కక్షలు, కార్పణ్యాలు.. వ్యామోహాలతో రక్తం చిందిన ఉదంతాలు.. వావివరుసలు మరచి, విచక్షణ విడిచేసిన మృగాల అఘాయిత్యాలు.. ఇంకా దొంగతనాలు.. గంజాయి బ్యాచ్‌ల దాడులు.. మందుబాబుల వీరంగాలు.. సైబర్‌ నేరాల వంటివి ఈ ఏడాది యథేచ్ఛగా కొనసాగాయి. సోషల్‌ మీడియా పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారి తీసి పచ్చని సంసారాల్లో చిచ్చులు రేపాయి. ఇలా ఎన్నో వివాదాలు, మరెన్నో విషాదాలకు నిలయమైన 2025.. నేర నామ సంవత్సరంగా నిలిచింది.

హత్యలతో అట్టుడికి..

వివాహేతర సంబంధా లు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక కారణాలు, రియల్‌ ఎస్టేట్‌ వివాదాలు, క్షణికావేశం వంటి కారణాలతో జరిగిన హత్యలతో జిల్లా ఈ ఏడాది అట్టుడికిపోయింది.

గొల్లప్రోలులోని ఓ ప్రాంతంలో కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం మే నెలలో కనిపించింది. దేహంపై గాయాలుండటంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. మొత్తం 7 వేల మిస్సింగ్‌ కేసులు పరిశీలించారు. అనకాపల్లికి చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడు కనిపించడం లేదంటూ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని తంగెళ్ల లోవరాజు(38)గా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి సహకారంతో సర్జికల్‌ బ్లేడ్‌తో లోవరాజు గొంతు కోసి హతమా ర్చి, మృతదేహాన్ని కత్తిపూడి – కాకినాడ మధ్య ఓ కాలువలో పడేసినట్లు తేలింది.

సామర్లకోట సీతారాం కాలనీలో ఓ భర్త.. తన భార్య మాధురిని, 4, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు పుష్పకుమారి, జెస్సీలను ఆగస్టులో దారుణంగా హతమార్చడం సంచలనం రేపింది.

ఈ ఏడాది అక్టోబర్‌లో ఇద్దరు మైనర్ల మధ్య ఓ అమ్మాయి కోసం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గంటా శామ్యూల్‌ను అభివర్ధన్‌ అనే స్నేహితుడితో పాటు శ్రీనివాస్‌ అనే యువకుడు బ్లేడ్‌తో గొంతు కోసి, ఆపై కాళ్లు చేతులు తాళ్లతో కట్టి, డ్రైనేజీ నీటిలో ముంచి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ డ్రైనేజీలోనే మృతదేహాన్ని వదిలేశారు. ఈ సంఘటనతో కాకినాడ నగర వాసులు ఉలిక్కిపడ్డారు.

కాకినాడ ఇంద్రపాలెంలో భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి నాపరాయితో ఆమె తల పగులగొట్టి చంపాడు.

మరో వ్యక్తి తన తమ్ముడి చెప్పుడు మాటలు విని భార్య గొంతు కోసి, తానూ పురుగు మందు తాగాడు. భార్య బతికింది, భర్త చనిపోయాడు.

ఈ నెలలో కాకినాడ సంతచెరువు వద్ద చెప్పులు కుట్టే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అంతకు ముందు రోజు ఘర్షణ పడ్డ వ్యక్తి తనను, తన తల్లిని తిడతావా అంటూ చెప్పులు కుట్టే పదునైన పరికరంతో అతడి గుండెల్లో గుచ్చాడు. ఆ గాయంతోనే బాధితుడు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు అతడిని ఆస్పత్రికి పంపించారు. అక్కడకు వెళ్లేసరికే అపస్మారక స్థితి లో ఉన్న బాధితుడు మృతి చెందాడు.

ఇలా మరెన్నో హత్యలు జిల్లాలో చోటు చేసుకున్నాయి.

‘మృత్యు’రాదారులు

ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిద్ర మత్తు, దారుణంగా ఛిద్రమైన రహదారులు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఘటనల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా సత్ఫలితాలనివ్వడం లేదు.

ఫిబ్రవరిలో కాకినాడ – సామర్లకోట రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వృద్ధ జంట గోతుల వల్ల కుదుపులకు గురయ్యారు. ఈ క్రమంలో వెనుక కూర్చున్న వృద్ధురాలు కింద పడిపోయి, తలకు తీవ్ర గాయమై, అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం వద్ద భర్త రోదించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది.

ఏప్రిల్‌ 5న జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన మల్లేపల్లి శ్రీను తన పెళ్లి బట్టలు కొనుక్కునేందుకు కాకినాడ వచ్చి వెళ్తూండగా లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోవడం స్థానికులను, కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

మే 17న విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఓ కారు తుని వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.

నవంబర్‌ 8వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం వద్ద హైవేపై అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కనిపించిన వాహనాలనల్లా ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో బస్టాప్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఇంకా మరిన్ని ప్రమాదాల్లో ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలించారు.

సైబర్‌ నేరాలు

ఈ ఏడాది సైబర్‌ నేరాలు సైతం గణనీయంగా పెరిగాయి. కంటికి కనిపించని చీకటి దొంగలు ఆన్‌లైన్‌లో వివిధ నేరాలకు పాల్పడుతూ పోలీసుల మతులు పోగొడుతున్నారు.

ప్రతాప్‌ నగర్‌కు చెందిన ఓ విశ్రాంత అధికారి ఈ ఏడాది ఆరంభంలో డిజిటల్‌ అరెస్టు పన్నాగంలో చిక్కుకోబోయి త్రుటిలో తప్పించుకుని, సుమారు రూ.40 లక్షల సొత్తు కాపాడుకున్నాడు.

పెద్దాపురానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి వలపు వల విరిసిన సైబర్‌ నేరగాళ్లు ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డారు. డబ్బు ముట్టజెప్పినా వేధింపులు ఆగలేదు. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

కాకినాడ మెయిన్‌ రోడ్‌లో ఓ డీటీపీ సెంటర్‌ నిర్వాహకుడు సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి వ్యాపారం పేరిట రూ.2 లక్షలు కోల్పోయాడు.

జిల్లాలో సైబర్‌ నేరాల నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కితే ఎక్కడ, ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలనే అంశాలపై బాధితులకు కనీస అవగాహన కూడా ఉండటం లేదు. పోలీసు శాఖలో సైబర్‌ సెల్‌ లేకపోవడం, ఉన్న ఐటీ కోర్‌ విభాగ మే ఈ నేరాలపై పని చేయడంతో తగిన ఫలితాలు రావడం లేదనే విమర్శలకు తావిస్తోంది.

జిల్లాను కుదిపేసిన హత్యలు

ఆయువు తీసిన ప్రమాదాలు

అమ్మాయిలపై అఘాయిత్యాలు

మూలమూలలకూ గంజాయి మత్తు

వివాదాలు, విషాదాలకు

నిలయంగా 2025

అమ్మాయిలపై అఘాయిత్యాలు

మహిళలు, బాలికలపై ఈ ఏడాది అఘాయిత్యాలు పెరిగాయి. మృగాల బారిన పడి మైనర్లు చివురుటాకుల్లా వణికిపోయారు.

కాకినాడ వెంకట్‌ నగర్‌లో పదకొండేళ్ల బాలికపై బాబాయి.. 13 ఏళ్ల మైనర్‌పై తాతయ్య అఘాయిత్యానికి పాల్పడ్డారు.

తునిలో ఓ వృద్దుడు తాతయ్యనంటూ టీచర్లకు చెప్పి, ఓ విద్యార్థినిని పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లి తోటల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతకు ముందు నుంచే వృద్ధుడు ఈ దురాగతానికి పాల్పడుతూ వచ్చాడు. చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

ప్రమాదాల నివారణకు స్మార్ట్‌ పార్కింగ్‌ అలర్ట్‌ సిస్టం

హైవేలపై నిలిపి ఉంచే వాహనాల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జూలైలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించిన విషాద ఘటన అనంతరం జిల్లా పోలీస్‌ శాఖ ప్రయోగాత్మకంగా స్మార్ట్‌ పార్కింగ్‌ అలర్ట్‌ సిస్టం విధానాన్ని అమలు చేసింది. ప్రత్యేక లేజర్‌ సాంకేతికత ఆధారంగా రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల సమాచారం 45 సెకండ్లలోనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరుతుంది. తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించే ఆస్కారం కలిగింది. ఈ విధానం ప్రారంభించాక రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాల వల్ల ఇప్పటి వరకూ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. పొరుగు జిల్లాలు కూడా దీనిని అవలంబిస్తున్నాయి. గతం కంటే గంజాయి నియంత్రణ మెరుగ్గా ఉంది. ఈగల్‌ టీంలు అందుకు పని చేస్తున్నాయి. క్షణికావేశాలే హత్యలకు కారణం. ప్లాన్‌ చేసి హత్య చేసిన ఉదంతాలు లేవు. మహిళలపై నేరాలు తగ్గాయి. మైనర్లపై జరుగుతున్న అకృత్యాలను ఉపేక్షించడం లేదు. త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.

– జి.బిందుమాధవ్‌, జిల్లా ఎస్పీ, కాకినాడ

నేర నామ సంవత్సరం1
1/5

నేర నామ సంవత్సరం

నేర నామ సంవత్సరం2
2/5

నేర నామ సంవత్సరం

నేర నామ సంవత్సరం3
3/5

నేర నామ సంవత్సరం

నేర నామ సంవత్సరం4
4/5

నేర నామ సంవత్సరం

నేర నామ సంవత్సరం5
5/5

నేర నామ సంవత్సరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement