నేడు రమణ మహర్షి జయంతి
ప్రత్తిపాడు రూరల్: ఆంధ్రా అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమంలో రమణ మహర్షి 146వ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించనున్నారు. దీనికి 15 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలు, భక్తుల సహకారంతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు కంఠం వేణుస్వామి అఖండ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఉపనిషత్ పారాయణ, ప్రణవ పతాక ప్రతిష్ఠాపన, గోపూజ, రమణ అష్టోత్తర శతనామావళి, మూలమంత్ర హోమం, అర్చన, లక్ష్మీ గణపతి హోమం అనంతరం 10.30 గంటలకు ఆధ్యాత్మిక సభ నిర్వహించనున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకుడు స్వామి రామానంద తెలిపారు.
యాగశాల పక్కన
మెట్లదారి విస్తరణ
అన్నవరం దేవస్థానం చైర్మన్ ఆదేశం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని యాగశాల పక్క నుంచి దిగువకు వెళ్లేందుకు ఉన్న మెట్లను మరింత వెడల్పుగా విస్తరించాలని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మెట్ల దారిని సోమవారం ఆయన పరిశీలించారు. కార్తిక మాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, సత్యదేవుని దర్శనానంతరం వారు దిగేందుకు తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్లు మాత్రమే సరిపోవని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు రావిచెట్టు పక్క నుంచి యాగశాల వద్దకు చేరుకునేలా అదనంగా మెట్లు నిర్మించారు. అక్కడి నుంచి రామాలయ ప్రాంగణంలోకి వెళ్లడం సులువవుతుందని ఆయన భావించారు. అయితే ఈ మెట్లు 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో సరిపోవడం లేదు. గత కార్తిక మాసంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తుల తోపులాట జరిగింది. దీంతో ఈ మెట్లను మరో 10 అడుగుల వెడల్పున విస్తరించాలని చైర్మన్ ఆదేశించారు. అయితే, దీనివలన యాగశాల దక్షిణం వైపు మెట్లు సగం వరకూ పోయే అవకాశముంది. ఈ విషయమై సిద్ధాంతితో మాట్లాడగా.. దక్షిణం వైపు మెట్లు సగం తొలగించి, వాటికి బదులు ఎల్ ఆకారంలో తూర్పునకు మెట్లు నిర్మించి, వాటిని మిగిలిన వాటికి అనుసంధానం చేయాల్సిందిగా సూచించారని ఈఈ రామకృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ మెట్ల వెడల్పునకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవనున్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీలో
జిల్లా జయకేతనం
సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపియన్‌షిప్ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు.
ఈ–కామర్స్ డెలివరీ కోర్సు
ట్రైనర్లకు దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ–కామర్స్ డెలీవరీ అసోసియేట్ కోర్సు ట్రైనర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ఎస్.గోపీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. దరఖాస్తుతో పాటు ఇతర వివరాలకు ప్రభుత్వ ఐటీఐ లేదా స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ రేవతిని 86399 51441 నంబరులో సంప్రదింవచ్చని సూచించారు.
నేడు రమణ మహర్షి జయంతి


