‘ముక్కోటి’కి ముస్తాబు
● రత్నగిరిపై పూర్తయిన ఏర్పాట్లు
● ఉదయం 5 గంటల నుంచి
ఉత్తర ద్వార దర్శనం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముస్తాబైంది. సత్యదేవుని ప్రధానాలయంతో పాటు తూర్పు రాజగోపురం, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలమాలలు, విద్యుద్దీప తోరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సత్యదేవుని ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకూ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రధానాలయం ఉత్తర ద్వారం వద్ద ఉత్తరాభిముఖంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శేషపాన్పు మీద పవళిస్తున్న విష్ణుమూర్తి, లక్షీదేవి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. తెల్లవారుజామున 4 గంటలకు పండితులు స్వామి, అమ్మవార్లకు పంచ హారతి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పిస్తారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగిస్తారు. దీనికోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ భక్తులు దిగువ నుంచి ఆలయ ప్రాకారంలోకి క్యూలో ప్రవేశించాక.. దక్షిణ ద్వారం నుంచి లోపలకు వెళ్లి, స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు వచ్చేవారు. ముక్కోటి సందర్భంగా దక్షిణ ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం వద్దనే ఏర్పాటు చేసిన స్వామి, అమ్మవార్లను దర్శించి, అక్కడి నుంచి తూర్పు ద్వారం వైపు వెళ్లి, గర్భాలయంలో సత్యదేవుడు, అమ్మవారిని దర్శించుకుని, దక్షిణ ద్వారం వద్ద ఉన్న క్యూ లైనులో వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేస్తారు. ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి రధంపై ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తారు. అలాగే, రాత్రి 7 గంటల నుంచి వెండి గరుడ వాహనంపై అన్నవరం గ్రామంలో ఊరేగించనున్నారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు సోమవారం పరిశీలించారు. ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు సుధీర్ తదితరులతో ఆలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓ పెండ్యాల భాస్కర్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘ముక్కోటి’కి ముస్తాబు


