పిఠాపురం: బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని బయటకు వస్తున్న వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు కలిసి మీ డబ్బు కింద పడిపోయిందని అని చెప్పగా కింద ఉన్న నోట్లు తీసుకునే లోపు అతని వద్ద నగదుతో ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లి పోయారు దుండగులు. పిఠాపురం స్టేట్‌బ్యాంకు వద్ద శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పిఠాపురం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... పిఠాపురం పట్టణం కొండప్ప వీధికి చెందిన నందిపాటి నారాయణమూర్తి ధాన్య కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల అమ్మిన ధాన్యానికి సంబంధించి మిల్లు యజమాని బ్యాంకులో వేసిన సొమ్ము తెచ్చుకునేందుకు పిఠాపురం స్టేట్‌బ్యాంకు వద్దకు వెళ్లాడు. బ్యాంకులో తన ఖాతాలో ఉన్న రూ.6 లక్షలు తీసుకుని, తన కూడా తెచ్చుకున్న బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు వచ్చాడు. తన మోటారు సైకిల్ వద్దకు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ డబ్బు కింద పడిపోయిందంటూ కింద పడి ఉన్న రూ.50 నోట్లు చూపించారు. దీంతో బ్యాగ్ ఒక చేత్తో పట్టుకుని కిందకు వంగి మరో చేత్తో కింద పడిఉన్న రూ.50 నోట్లను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నారాయణమూర్తి వద్ద డబ్బుతో ఉన్న బ్యాగ్‌ను ఒక్క ఉదుటున లాక్కుని పరారయ్యారు. హఠాత్ పరిణామం నుంచి తేరుకుని గట్టిగా కేకలు వేసినా ఫలితం లేక పోవడంతో బాధితుడు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.