
సజావుగా సప్లిమెంటరీ పరీక్షలు
కాకినాడ సిటీ: టెన్త్, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 7,915 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకూ విద్యార్థులను అనుమతిస్తారన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రాకూడదన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, పోలీస్ అధికారులతో 4 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయాలని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో తాగునీరు, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్లు, డీఎంహెచ్‌ఓలకు సూచించారు. పరీక్ష సమయంలో అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఏపీ ఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరేందుకు వీలుగా ఆయా రూట్లలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకూ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరుగుతాయని కలెక్టర్ నివాస్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ సెకండియర్ పరీక్షలు జరుగుతాయని వివరించారు. జిల్లాలోని 28 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 22,293 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. టెన్త్ పరీక్షల మాదిరిగానే ఇంటర్ పరీక్షల నిర్వహణకు కూడా అన్ని ఏర్పాట్లూ చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ డి.తిప్పేనాయక్, డీఈవో పి.రమేష్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వి.రాజశేఖర్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి జీజీకే నూకరాజు, ఓపెన్ స్కూల్ డిప్యూటీ కమిషనర్ సాయి వెంకటరామ్, కాకినాడ నగర ఏడీసీ సీహెచ్ నాగనరసింహరావు, డీఎంహెచ్‌ఓ జె.నరసింహ నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎం.శ్రీనివాసరావు, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ టెన్త్, ఇంటర్‌కు 24 నుంచి నిర్వహణ
ఫ అన్ని ఏర్పాట్లూ చేయాలని
అధికారులకు కలెక్టర్ ఆదేశం