డ్రంకెన్ డ్రైవ్‌తో నిత్యకృత్యమైన రోడ్డు ప్రమాదాలు
అవగాహన ఏది?
అతివేగం కంటే ప్రాణం మిన్న విషయాన్ని కొందరు పెడచెవిన పెడుతున్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన లేకపోవడం కూడా ఓ రకంగా ప్రమాదాలకు కారణమవుతోంది. ఏ రోడ్డుపై ఎంత మేర స్పీడ్ వెళ్లాలి.. ఎటు నుంచి ఇతర వాహనాలను ఓవర్ టెక్ చేయాలి... ఎదురుగా వస్తున్న వాహనాలతో ప్రమాదాలకు గురికాకుండా ఎలా బయట పడాలనే అంశాలపై యువ డ్రైవర్లకు అవగాహన లేకుండా పోతోంది. పైగా సూచిక బోర్డులను సైతం కొందరు గమనించడం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వ్యామోహంగా మారుతోంది. మరోవైపు నిద్రలేమి కూడా ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు.
గద్వాల క్రైం: మద్యం మత్తులో డ్రైవింగ్‌తో రోడ్డు భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కొందరు మత్తులో వాహనం నియంత్రణ కోల్పోయి, తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడమే కాకుండా.. ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న వరుస ప్రమాదాల ధాటికి ఏడు రోజుల వ్యవధిలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరెందరో గాయాలపాలై ఆస్పత్రులపాలయ్యారు. మద్యం మత్తు, అజాగ్ర త్త, అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా వస్తే చాలనుకునే రోజులు వచ్చాయి. మద్యం మత్తులో వాయువేగంతో వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు..
ఈ నెల 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసాత్యసాయి జిల్లాకు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గంమధ్యలోని ధర్మవరం స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై నిలిపిన డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
గతనెల 31న మల్దకల్ మండలం పాల్వయి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి కారులో గద్వాల వైపునకు వస్తూ.. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో గూడ్స్ ఆటోను ఢీకొట్టారు. ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం సైతం మద్యం మత్తులోనే చోటు చేసుకుందని వెల్లడైంది.
గతనెల 30న నంద్యాల జిల్లాలోని జూపాడు బంగ్లాకు చెందిన ఇద్దరు యువకులు మల్దకల్ మండలం నీలిపల్లెలోని బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అయిజకు చెందిన బంధువు వారిద్దరిని తాటికుంట స్టేజీ సమీపానికి వస్తే మంచి విందు చేసుకోవచ్చని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఇద్దరు బంధువుతో కలసి మద్యం తాగారు. ఆ తర్వాత ముగ్గురు గృహప్రవేశ కార్యక్రమానికి బైక్‌పై వెళ్తూ.. ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో జూపాడు బంగ్లాకు చెందిన ఓ యువకుడు, చిన్నతాండ్రపాడుకు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు. ఇలా జిల్లావ్యాప్తంగా 11 నెలల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 94 మంది మృత్యువాత పడ్డారు. 110 మందికి పైగా గాయాలపాలయ్యారు.
తమతో పాటు ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్న మందుబాబులు
11 నెలల వ్యవధిలోనే 94 మంది మృత్యువాత
110 మందికి పైగా ఆస్పత్రులపాలు


