బడిపిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బడిపిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌

Nov 5 2026 12:52 AM | Updated on Nov 5 2026 12:52 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు ఉదయమే పౌష్టిక అల్పాహారం అందించాలన్న లక్ష్యం ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. బడికి వచ్చే విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉమ్మడి పాలమూరులోని కొన్ని మండలాలకే పరిమితమైంది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో దశలవారీగా అమలు చేస్తున్నా.. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం రెండు జిల్లాల్లోని పది మండలాల పరిధిలో 263 పాఠశాలల్లో 22,881 మంది విద్యార్థులకు మాత్రమే అల్పాహారం అందుతోంది. మిగతా మండలాల విద్యార్థులకూ ఈ పథకం ఎప్పటికి చేరుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కిచెన్‌షెడ్లే కీలకం..

ఉదయం వేళ విద్యార్థులకు ఐదు రకాల అల్పాహారంతోపాటు పాలు, జావ అందించాల్సి ఉంది. ఇందుకోసం పాఠశాలల్లోనే వంట చేయడం కాకుండా.. సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కిచెన్‌షెడ్లలో ఒకేచోట అల్పాహారం తయారు చేసి పాఠశాలలకు తరలించే ఇంటిగ్రేటెడ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే అవసరమైన చోట్ల కిచెన్‌షెడ్లు అందుబాటులో లేకపోవడంతో పథకం విస్తరణకు ఆటంకం ఏర్పడుతోంది. ఉన్న కొద్దిపాటి వంటశాలల నుంచే పాఠశాలలకు అల్పాహారం సరఫరా చేస్తున్నారు.

● మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా.. ప్రస్తుతం ఆరు మండలాల్లోని 160 పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. మహబూబ్‌నగర్‌ రూరల్‌, అర్బన్‌, చిన్నచింతకుంట, కౌకుంట్ల, నవాబుపేట, హన్వాడ మండలాల్లోని 14,681 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. గతంలో రూరల్‌, హన్వాడ మండలాల్లోనే మాత్రమే కొనసాగిన ఈ కార్యక్రమాన్ని ఈనెల నుంచి మరో నాలుగు మండలాలకు విస్తరించారు. అయినప్పటికీ మిగతా 11 మండలాల్లోని విద్యార్థులకు ఇంకా ఈ పథకం అందుబాటులోకి రాలేదు.

● నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూర్‌, కొత్తపల్లి, గుండుమాల్‌ మండలాల్లో 123 పాఠశాలల పరిధిలో 8,200 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. రెండు నెలల క్రితం రెండు మండలాల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల మొదటి వారం నుంచి మరో రెండు మండలాలకు విస్తరించారు.

విస్తరణకు వంటశాలల కొరత..

పథకాన్ని మరిన్ని మండలాలకు విస్తరించాలంటే ముందుగా కిచెన్‌షెడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. మహబూబ్‌నగర్‌ బోయపల్లి, నవాబుపేటలో తాత్కాలిక వంటశాలల ద్వారా అల్పాహారం తయారు చేసి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. గతంలో కోడూరు వద్ద ఉన్న కిచెన్‌షెడ్డును రోడ్డు విస్తరణ కారణంగా ఖాళీ చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అవసరమైన వంటశాలలు ఏర్పాటు చేస్తేనే పథకాన్ని విస్తరించే అవకాశం ఉంది. దీంతో కిచెన్‌షెడ్ల నిర్మాణం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

పాఠశాలల్లో అల్పాహారం పథకానికి కిచెన్‌షెడ్ల కొరత

ఉమ్మడి పాలమూరులో పది మండలాలకే పరిమితం

మహబూబ్‌నగర్‌లో 6, నారాయణపేటలో 4 మండలాల్లో అమలు

గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాని వైనం

22,881 మంది విద్యార్థులకే ఉదయపు అల్పాహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement