గద్వాల: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సక్రమంగా పౌష్టికాహారం అందిస్తూ.. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు అంటే కేవలం పిల్లలకు పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య అందించడమే కాకుండా.. చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను కూడా గమనించేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో బరువు, ఎత్తు తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టిసారించి.. వారికి అవసరమైన చికిత్సతో పాటు ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందజేయాలన్నా రు. చిన్నారులకు కంటి, చెవి, ఇతరత్రా సమస్యల తో పాటు మానసిక పరిస్థితిపై పర్యవేక్షణ అవసరమన్నారు. జిల్లాలో కొంతమందికి మేనరిక వివాహాల కారణంగా కూడా అంగవైకల్యం, బుద్దిమాంద్యంతో బాధపడే చిన్నారులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రా లకు వచ్చే పిల్లలందరికీ 20 రోజుల్లోగా వివిధ పరీక్షలు పూర్తిచేసి, నివేదికను అందజేయాలన్నారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను వీబీ–జీ రామ్‌జీ పథకంలో నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తరచుగా అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షణ చేయాలని.. ఏమైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా సఖి సేవలను విస్తరించాలన్నారు. విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్‌పై కౌమర దశలోనే అవగాహన కల్పించాలని సూచించారు. డీడబ్ల్యూఓ సునంద, డీసీపీఓ నర్సింహ, ఐసీడీఎస్ సీడీపీఓలు రాజేశ్వరి, హేమలత, సూపర్వైజర్లు ఉన్నారు.


