రుచికర వంటకాల్లో.. కల్తీ కహానీ! | - | Sakshi
Sakshi News home page

రుచికర వంటకాల్లో.. కల్తీ కహానీ!

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

పాలమూరు: చూడగానే నోరూరించే వంటకాలు.. తింటే ఆరోగ్యానికి చేటు చేసే పదార్థాలు.. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లలో ఆహార కల్తీ వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. వంటకాలకు రుచి, రంగు కోసం కొన్ని చోట్ల చైనా ఉప్పు (ఎంఎస్‌జీ), కృత్రిమ రంగులు, నాణ్యత లేని మసాలాలు వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రోజుల తరబడి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసాహారంతో పాటు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు, కల్తీ నూనెలు ఉపయోగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆహార భద్రత ప్రమాణాలను విస్మరించి వంటకాలు తయారు చేస్తే ప్రజారోగ్యంపై ప్రభావం పడే ప్రమాదముంది.

తనిఖీలు లేక.. యథేచ్ఛగా కల్తీ

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో దాదాపు 30 వేల హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు, స్ట్రీట్‌ఫుడ్‌ విక్రయ కేంద్రాలున్నాయి. వీటిపై నిరంతర పర్యవేక్షణ అవసరమైనా ఇటీవల ఆహార తనిఖీలు పెద్దగా కనిపించడం లేదనే విమర్శలున్నాయి. అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరిస్తున్నా.. వాటి ఫలితాలు, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై తీసుకుంటున్న చర్యల వివరాలు బహిర్గతం కావడం లేదనే అభిప్రాయాలున్నాయి. గతంలో హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల తనిఖీల్లో నిల్వ ఉంచిన మాంసాహారం, కృత్రిమ రంగులు, కల్తీ కారం, గడువు ముగిసిన మసాలాలు, కల్తీ నూనెలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వంటకాలకు రుచి పెంచేందుకు ఉపయోగించే చైనా ఉప్పు (ఎంఎస్‌జీ)ని పరిమితికి మించి వినియోగించ వద్దని, ముఖ్యంగా ఆహార తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్య త, నిల్వ విధానాలపై శ్రద్ధ అవసరమని అధికారు లు చెబుతున్నారు. సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయని ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా పెరిగి వాంతులు, విరేచనాలు వంటి ఆహార సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు

ఆహార కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీ–సేఫ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక తనిఖీలకు సిద్ధమైంది. ఈ నెల మొదటి వారంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 15 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ప్రత్యేక బృందాలు రానున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లతో పాటు ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. మరోవైపు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 15 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఈ నెల 15వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ఆహార కల్తీని అరికట్టేందుకు మొదట నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 15 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం. ఆహార పదార్థాల నమూనాలు సేకరించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వం చేపడుతున్న టీజీ–సేఫ్‌ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నవంబర్‌ మొదటి వారంలో సుమారు 15 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించనున్నాం. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ప్రత్యేక బృందాలు రానున్నాయి. ప్రధానంగా వంటగదుల పరిశుభ్రత, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల నాణ్యత, గడువు ముగిసిన వస్తువుల వినియోగం, కల్తీ పదార్థాల వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే హోటళ్లపై ఈసారి కఠిన చర్యలు తీసుకుంటాం.

– శ్రీలత, ఫుడ్‌సేప్టీ అధికారి

చైనా ఉప్పు.. కృత్రిమ రంగులు.. నాసిరకం మసాలాల మోత

హోటళ్లు, రెస్టారెంట్లలో యథేచ్ఛగా కల్తీ పదార్థాల వినియోగం

ఉమ్మడి జిల్లాలో ఇటీవల కొరవడిన ఆహార తనిఖీలు

టీజీ–సేఫ్‌ కింద 15 బృందాలతో ప్రత్యేక తనిఖీలకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement