ధరూరు: విద్యార్థులు క్రీడల్లో జిల్లా ఖ్యాతిని చాటాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె ధరూరులోని జెడ్పీహెచ్ఎస్లో జిల్లాస్థాయి బాలికల క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. బాలికలు క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకురావడం సంతోషకరమైన విషయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు వారికి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు గురు, శుక్రవారాల్లో పోలీస్ అకాడమీ హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పీఎంశ్రీ స్కూల్స్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
● మండలంలోని మన్నాపురం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేసి.. మధ్యాహ్న భోజనం, విద్యా బోధన, అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టీచింగ్ డైరీని క్రమం తప్పకుండా రాయాలని చెప్పారు. పాఠశాల లో విద్యా ప్రమాణాల పెంపుతోపాటు విద్యార్థు లకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, పరిశుభ్ర మైన వాతావరణం కల్పించాలని సూచించారు.


