● అంగన్‌వాడీ, కేజీబీవీ,
పీహెచ్‌సీల సందర్శన
గట్టు: కేంద్రం బృందం సభ్యుడు, నోడల్ అధికారి లోకేష్ మంగళవారం సాయంత్రం గట్టులో పర్యటించారు. పీఆర్ ఈఈ ప్రభాకర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సునంద, డీఆర్‌డీఓ ముసాయిదాబేగంతో కలిసి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నోడల్ అధికారి మాట్లాడారు. దేశవ్యాప్తంగా వెనకబడిన 513 మండలాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టును ఎంపిక చేసిందన్నారు. వివిధ అంశాల ఆధారంగా అభివృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అనంతరం సంతబజారు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి.. చిన్నారుల హాజరు శాతాన్ని పరిశీలించారు. బరువు తక్కువ పిల్లలను గుర్తించే విధానం, వారి పట్ల తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి వివరాలు సేకరించారు. టీహెచ్‌ఆర్, కిచెన్ గార్డెన్, వాష్‌రూం ఉపయోస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. ఆ తర్వాత కేజీబీవీకి చేరుకొని విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, ఇతర అవసరాల గురించి ఆరా తీశారు. అయితే బాలికలు ఎక్కువగా, గదులు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి.. మరో కేజీబీవీ ఏర్పాటు చేయాలని సర్పంచు నాగరాజు, వార్డు సభ్యులు నోడల్ అధికారి వినతిపత్రాన్ని అందజేశారు. అక్కడి నుంచి పీహెచ్‌సీకి చేరుకొని రోగులకు అందిస్తున్న సేవలు, దీర్ఘకాలిక రోగాలైన షుగర్, బీపీ ఇతర వ్యాధులకు మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయా.. ప్రతినెల రోగులకు అందిస్తున్నారా అంటూ ఆరాతీశారు. ఇదే క్రమంలో ఆస్పత్రి ఆవరణలోనే రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు.ఆస్పత్రిలోనే ప్రసవాలు అయ్యేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రసవాలకు తప్పనిసరిగా ఆస్పత్రికి వచ్చేలా వైద్య బృందం చర్యలు తీసుకోవాలని కోరారు. గర్భిణుల నమోదు, ప్రతినెలా చెకప్ చేయించుకునేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహ్మద్ అబ్దుల్ సయ్యద్‌ఖాన్, ఎంపీఓ సయ్యద్‌బాసిత్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ వాసంతి తదితరులు పాల్గొన్నారు.


