పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Oct 23 2026 12:45 AM | Updated on Oct 23 2026 12:45 AM

ఇటిక్యాల: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్డీఓ ముషాయిదా బేగం అన్నారు. మిషన్‌ అమృత్‌ సరోవర్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇటిక్యాల మండలం మునగాల చెరువు కట్టపై అధికారులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు పెంచడంతో పాటు ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. పచ్చదనం పెంపొందించడం, ప్రకృతి సమతుల్యతను కాపాడటం, నీటి వనరుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే మిషన్‌ అమృత్‌ సరోవర్‌ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్‌వీఈటీ కింద రూ. లక్ష ఆర్థికసాయంతో ఏర్పాటుచేసిన టీ స్టాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమాదేవి, ఏపీఓ శరత్‌, ఏపీఎం పద్మ, సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగాధర్‌ పాల్గొన్నారు.

కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

అలంపూర్‌: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రవాణారంగ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ, పబ్లిక్‌, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గురువారం అలంపూర్‌ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో వారు మహాధర్నా పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. రవాణారంగ కార్మికులకు ప్రతి ఏడాది రూ.12 వేల భృతి ఇస్తామని, సంక్షేమబోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వాటిని అమలు చేయని ప్రభుత్వం.. వాహనం సిగ్నల్‌ జంప్‌ ఇతర చలానాలకు యజమానికి తెలియకుండానే వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు కట్టయ్యే పద్ధతి చేయాలని ప్రకటించడం బాధ్యతారహితమన్నారు. ఇది రవాణారంగ కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు పెరుగుతున్న డీజీల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 50 కి.మీ. ఒక చోట డ్రైవర్లకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలన్నారు. రవాణారంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాము, కృష్ణ, సుభాన్‌, కొండన్న, అశోక్‌, హుస్సేన్‌, రాకేశ్‌, మద్దన్న పాల్గొన్నారు.

పల్లీ క్వింటా రూ.8,542

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 81 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,542, కనిష్టంగా రూ. 5,169, సరాసరి రూ. 7,320 ధరలు లభించాయి. అలాగే 30 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ. 7,969, కనిష్టంగా రూ. 7,809, సరాసరి రూ.7,959 ధరలు పలికాయి.

సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు

మల్దకల్‌: సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు సాధించవచ్చని.. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు. గురువారం మల్దకల్‌ రైతువేదికలో రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పండించే పంటలను సాగుచేయాలని సూచించారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటల సాగుపై దృష్టిసారించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారిణి పుష్ప, జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్‌కుమార్‌, ప్రతాప్‌కుమార్‌, ఏఓ రాజశేఖర్‌, మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement