గద్వాల: భూ స్వాముల దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా పండుగ సాయన్న నిలిచారని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. గురువారం పండుగ సాయన్న జయంతి సందర్భంగా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐసీడీసీ ఆవరణలో తెలుగు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బుర్ర కథలు, జానపద పాటల ద్వారా పలువురు కళాకారులు సాయన్న జీవితాన్ని, ఆయన జీవితంలో జరిగిన ఘట్టాలను వెలుగులోకి తెచ్చారన్నారు. పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. బహుజనులకు న్యాయం జరిగేందుకు ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


