గద్వాలన్యూటౌన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ గద్వాలశాఖ నాయకులు వీరభద్రప్ప, ఆలూరు ప్రకాశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. పండుగ సాయన్న జయంతి సందర్భంగా గురువారం స్థానిక జేఏసీ కార్యాలయంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. పాలమూరు ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా చేపడుతున్న డిండి ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పాలమూరు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని.. అనేక ప్రాజెక్టులు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తిచేసి, ఈ ప్రాంతానికి దక్కాల్సిన నీటి వాటాను అందించాలన్నారు. లక్ష సంతకాల సేకరణ ద్వారా పాలమూరు ప్రజల గొంతుకను ప్రభుత్వానికి వినిపించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం పెండింగ్ ప్రాజెక్టులపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శంకర ప్రభాకర్, మధుసూదన్‌బాబు, భద్రప్ప పాల్గొన్నారు.


