ఇటిక్యాల: గణేశ్ ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలందుకున్న గణనాథులను క్రమంగా బీచుపల్లి వద్ద కృష్ణానదిలో భక్తులు నిమజ్జనం చేశారు. గురువారం తొమ్మిదో రోజు కావడంతో నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గణనాథులను నిమజ్జనానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేను సహాయంతో అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు దాదాపు వందకుపైగా గణనాథులను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జనం ప్రాంతాన్ని రాత్రి 9 గంటల సమయంలో ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగులయ్య, సీఐ ప్రదీప్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. నిమజ్జనం దృష్ట్యా బీచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అలాగే జాతీయ రహదారిపై ట్రాఫిక్‌జాం కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 40 మంది సిబ్బందితో భధ్రత కల్పించి నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్‌కు ఎస్పీ సూచించారు.


