ధరూరు: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించేలా వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని నాగర్‌దొడ్డి, నెట్టెంపాడు, నీలహళ్లి, ద్యాతదొడ్డి, మాల్‌దొడ్డి, చిన్నపాడు తదితర గ్రామాల్లో పింఛన్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్ అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్‌కు సంబంధించిన వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పింఛన్ వెరిఫికేషన్ చేపట్టాలన్నారు. అలాగే గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామీణాభివృద్ధి కోసం చేపడుతున్న పథకం పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ఎల్‌నినో ప్రభావం కారణంగా గ్రామాల్లో వ్యవసాయం తదితర అంశాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇంగుడు గుంతలను పరిశీలించిన ఆయన త్వరగా బిల్లులు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వాతావరణం ప్రభావం వల్ల పంటలకు నష్టం వాటిళ్లకుండా చూసుకోవాలన్నారు. వీబీజీ రాంజీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించి.. కూలీలతో మాట్లాడారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం వేళల్లో పనులకు వెళ్లాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు సవారన్న, పరమేష్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


