వెలుగుల దీపావళి | - | Sakshi
Sakshi News home page

వెలుగుల దీపావళి

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

న్యూస్‌రీల్‌

జోగుళాంబ గద్వాల

ఆదివారం శ్రీ 8 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల: అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 3న నిర్వహించనున్న దివ్యాంగుల సాధికారత రాష్ట్ర పురస్కారాలు–2026 ప్రదానానికి వ్యక్తిగత, సంస్థాగత విభాగాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సునంద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారత, అభివృద్ధి కోసం విశేష సేవలందిస్తున్న అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారం, అర్హత ప్రమాణాలు, ఇతర మార్గదర్శకాల కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ https.depwsetgp.telangana.gov.in సందర్శించాలన్నారు. దరఖాస్తు ఫారాన్ని అన్ని ధ్రువపత్రాలను జతచేసి ఈ నెల 16లోగా కలెక్టరేట్‌లోని రూం నం.జీ33లో అందజేయాలని కోరారు.

ఫార్మా–డీ, లా పరీక్ష ఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) ఫార్మా–డీ, లా కళాశాల పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్‌ శనివారం విడుదల చేశారు. ఫార్మా–డీ మొదటి సంవత్సరం పరీక్షలకు 29 మందికి గాను 17 మంది, రెండో సంవత్సరం 51 మందికి గాను 46 మంది హాజరయ్యారు. ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఆరో సెమిస్టర్‌ పరీక్షలకు 29 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, కంట్రోలర్‌ ప్రవీణ, ప్రిన్సిపాల్‌ భూమయ్య, ఈశ్వర్‌కుమార్‌, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పల్లీ @ రూ.9,524

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శనివారం 984 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.9,524, కనిష్టంగా రూ.4,879, సరాసరిగా రూ.7,300 ధరలు లభించాయి. అలాగే 5 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.7,719, కనిష్టంగా రూ.7,669, సరాసరిగా రూ.7,719 చొప్పున పలికాయి. 354 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.3,159, కనిష్టంగా రూ.2,269, సరాసరిగా రూ.3062 ధరలు వచ్చాయి.

గద్వాల న్యూటౌన్‌/ రాజోళి: జ్ఞానానికి.. సంతోషానికి.. నిర్మలత్వానికి ప్రతీక దీపం.. అలాంటి దీపం ప్రాముఖ్యత తెలిపేందుకు వచ్చిందే దీపావళి పర్వదినం. దీంతోపాటు చెడుపై గెలిచిన మంచికి ప్రతీక దీపావళి. ఏటా అశ్వయిజ మాసం అమావాస్య రోజు దీపావళి వస్తుంది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా ప్రజలు సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోనున్నారు. పిల్లలు, మహిళలు, పురుషులు, రైతులు, వ్యాపారులు ఇలా అందరూ.. నరక చతుర్దశి నాడు ఉదయాన్నే స్నానాలు ఆచరించి.. రెండు రోజుల పాటు ఇంటిల్లిపాది పండుగ సందడిలో పాల్గొంటారు. బొమ్మల కొలువులో, దీపాలను వెలిగిస్తూ.. మహిళలు, టపాసులతో.. పిల్లలు, యువత, మహాలక్ష్మిని పూజిస్తూ.. వ్యాపారులు, పశువులను కొలుస్తూ రైతులు అందరూ ఈ పండుగలో సందడిగా గడుపుతారు.

ఆకట్టుకునేలా మట్టి ప్రమిదలు..

ఎర్రమట్టితో జీవం పోసుకుంటాయి మట్టి ప్రమిదలు. ప్రాచీన కళా సంప్రదాయమైన ఈ కళా ప్రక్రియకు ఎప్పటికప్పుడు ఆధునికతను జోడిస్తూ.. నిత్యశోభను సంతరించుకునే మట్టి ప్రమిదలు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటాయి. అమావాస్య చీకటిని పారద్రోలి.. వెలుగులు ప్రసరింపజేయడడంలో దీపపు కుందెలు, ప్రమిదలు దీపావళి పండుగలో ముఖ్య భూమిక పోషిస్తుంటాయి. శుభానికి చిరునామాగా పసుపు, పారాణి అలంకరణతో ముస్తాబైన ఇంటి గడప, ప్రహరీ, ప్రాంగణం, వాకిళ్లలో ఒక్కొక్కటిగా జత చేసి.. పసిడి కాంతుల్ని నింపుతూ హిందూ సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తుంది ప్రమిదల కొలువు. స్థానికంగా కొంతమంది వ్యాపారులు వివిధ రూపాల్లో రూపొందించిన ప్రమిదలను రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల నుంచి మట్టి, సిరామిక్‌ దీపాలను తీసుకొచ్చి గద్వాలలో విక్రయిస్తున్నారు. చేతిలో ఇమిడిపోయే చిన్నపాటి ప్రమిదలతోపాటు అటు సంప్రదాయాన్ని ఇటు వైవిధ్యం, నవ్యత కలబోసుకున్న ఆకర్షణీయమైన డిజైన్లతో ప్రమిదలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌ను బట్టి రూ.40 నుంచి రూ.150 వరకు ధరలున్నాయి. ప్రమిదల కొనుగోలుతో గద్వాలలోని కూరగాయల మార్కెట్‌, పాతబస్టాండ్‌ ప్రాంతం సందడిగా మారాయి. ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ప్రమిదలను కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు.

మార్కెట్‌లో సందడి..

దీపావళి పండుగ సందర్భంగా మార్కెట్లలో సందడి కనిపించింది. జిల్లాకేంద్రంలోని పూల మార్కెట్‌, పాతబస్టాండ్‌ ప్రాంతాలు, అలంపూర్‌, అయిజ, శాంతినగర్‌ మార్కెట్లలో కొనుగోలుదారులతో సందడి ఏర్పడింది. దీపాలు, బంతిపూలు, మిఠాయిలు, లక్ష్మీదేవి చిత్రపటాలు, గౌరీ నోముల దండలు, చాటలు, కుంకుమ, పూలు, పండ్లు, మామిడి ఆకుల విక్రయాలతోపాటు పటాకులు, బంగారు ఆభరణాలు, కొత్త దుస్తుల కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు ఇతర గృహోపకరణాల ఎలక్ట్రానిక్‌ వస్తువులకు ఆఫర్లు ఉండటంతో అమ్మకాలు జోరుగా సాగాయి.

ఆకర్షణీయంగా వివిధ రూపాల్లో ప్రమిదలు

పేలిన బాణాసంచా ధరలు..

దీపావళి అంటేనే బాణాసంచా. గడిచిన ఏడాదితో పోల్చితే ఈసారి 15 నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా గద్వాల, అయిజ, అలంపూర్‌, శాంతినగర్‌లో లైసెన్స్‌ కలిగిన 43 దుకాణాలకు అగ్నిమాపక శాఖ అనుమతి ఇచ్చింది. పండుగను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు ముందుగానే బాణాసంచా కొనుగోలు చేసి, దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. గద్వాలలోని తేరుమైదానంలో ఒకేచోట 15 దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నారు. ప్రతి టపాసుల బాక్స్‌పై ఉండే గరిష్ట ధరకు ఐదారు రెట్లు తగ్గించి వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇంత తగ్గించినా భారీగా లాభం ఉంటుందని వ్యాపారులే చెప్పడం కొసమెరుపు. ఏడాదిలో ఒక్కసారి జరిగే వ్యాపారం కావడంతో ఎవరూ దీనిపై పెద్దగా దృష్టిసారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నేడు నరక చతుర్దశి, అమావాస్య లక్ష్మిపూజలు

అందరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ

ఆలయాల్లో పూజలు.. గౌరీ నోములు, వత్రాలకు ప్రత్యేకం

ప్రమిదలు, పూలు, టపాసులకు భలే గిరాకీ

జిల్లాలోని మార్కెట్లకు పండుగ శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement