వంటింట్లో ఉల్లి ఘాటు | - | Sakshi
Sakshi News home page

వంటింట్లో ఉల్లి ఘాటు

Aug 22 2026 12:47 AM | Updated on Aug 22 2026 12:47 AM

గద్వాల వ్యవసాయం: ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. వారం రోజుల వ్యవధిలో కిలోపై రూ.20 పెరిగింది. మున్ముందు ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్రలో అధిక వర్షాలకు దిగుబడులు తగ్గిపోవడం, స్థానికంగా దిగుబడులు చేతికి రాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు కలిగించనున్నాయి.

నడిగడ్డలో ఉల్లి సాగు..

నడిగడ్డలో ఏటా వానాకాలం సీజన్‌లో 1,800 నుంచి 2వేలు, యాసంగిలో 200 నుంచి 300 ఎకరాల్లో వర్షాధారం, బోరు బావుల కింద ఉల్లి సాగు చేస్తారు. వడ్డేపల్లి, అలంపూర్‌, ఇటిక్యాల, ఎర్రవల్లి, కేటీదొడ్డి, గట్టు, అయిజ మండలాల్లో ఎక్కువగా సాగవుతుంది. 110 రోజుల్లో పంట చేతికి వస్తుండగా.. వానాకాలం సీజన్‌లో ఎన్‌–53, బల్లారిరెడ్‌ రకాలను, యాసంగిలో రీసెర్చ్‌ రకాలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. విత్తనాలతోపాటు కొంతమంది రైతులు నారు కూడా వేస్తారు. వర్షాధారం కింద సాధారణ దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 టన్నులు, బోరుబావుల కింద 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తోంది.

అక్కడ అతివృష్టి.. ఇక్కడ అనావృష్టి

ఈసారి ఎల్‌నినో ప్రభావం వల్ల వానాకాలం సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీనికితోడు భూగర్భజలాలు బాగా తగ్గాయి. ఏటా మే చివరి వారం, లేదా జూన్‌లో ఉల్లి వేస్తారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఆలస్యంగా వేశారు. అయితే స్థానికంగా వచ్చే ఉల్లి ఉత్పత్తులకు తోడు మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి జిల్లాకు ఎక్కువగా దిగుమతి అవుతుంది. అక్కడ పండించే ఉల్లి ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. దీంతో సీజన్‌తో సంబంధం లేకుండా ఉల్లిని ఇక్కడి వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. మహారాష్ట్రలో అధిక వర్షాల వల్ల అక్కడి పంట దెబ్బతింది. ఇదే సమయంలో స్థానికంగా సాగైన ఉల్లి పంట ఇంకా చేతికి రాలేదు. ఉల్లి ధర పెరిగేందుకు ఇవే కారణమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కిలోపై ఒకసారి రూ.10, మరోసారి రూ.10 పెరిగింది. అయితే ఈ ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. స్థానికంగా వేసిన ఉల్లి చేతికి రావడానికి మరో నెల రోజుల సమయం పడుతుంది. దీనికితోడు సాగు విస్తీర్ణం సైతం తగ్గింది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇక్కట్లు పడుతుండగా.. ఉల్లి ధరలు మరింత భారం కానున్నాయి.

జిల్లాలో ఉల్లి సాగు ఇలా.. (ఎకరాల్లో)

2025 వానాకాలంలో సాగైన ఉల్లి

1,900

2026 వానాకాలం సీజన్‌లో సాగైన ఉల్లి

1,200

వారం రోజుల వ్యవధిలో కిలోపై రూ.20 పెంపు

మున్ముందు మరింత పెరిగే అవకాశం

మహారాష్ట్ర నుంచి

తగ్గిన దిగుబడులే కారణం

స్థానికంగా పంట చేతికొచ్చే

వరకు ఇదే పరిస్థితి

ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బెంబేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement