అలంపూర్: ప్రాజెక్టుల కింద ఉన్న చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. జిల్లాకేంద్రంలోని కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ కేశవరావుకు రైతులతో కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి గుడ్డెందొడ్డి రిజర్వాయర్ పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలోని సాగునీటిని పనులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని తన దృష్టికి తెచ్చారన్నారు. ప్రాజెక్టులు, కాల్వల పనులు పెండింగ్‌లో ఉండటంతో రైతులకు సాగునీరు అందించడంలో జాప్యం జరుగుతుందని, తద్వారా చివరి ఆయకట్టు రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ దగ్గర ప్యాకేజీ 99, 100 కింద కాల్వలు సకాలంలో పూర్తి చేయాలని, వీటిని పూర్తిచేస్తేనే చివరి ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే తాటికుంట రిజర్వాయర్‌కు అనుసంధానించే ప్యాకేజీ 106 కింద ఉన్న లింకు చానల్ పనులు అసంపూర్తిగా ఉందని, దీనిని కూడా పూర్తిచేయాలని కోరారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేస్తే ఆయకట్టుకు నీరందడంతోపాటు రైతులకు మేలు జరుగుతుందని విన్నవించారు. అలాగే నెట్టెంపాడు ప్యాకేజీలోని 99, 100, 106లోని కాల్వల్లో పేరుకున్న ముళ్ల పొదులు, గడ్డిని తొలగించాలని కోరారు.


