అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో దాదాపు పూర్తి కావొచ్చింది. దీనికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బీఎల్‌ఓలకు ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తేనే ఈ నెల 10 వరకు డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 85.50 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. మిగిలినవి 24.50 శాతం కూడా పూర్తిచేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వేగం పెంచారు. అయితే శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉన్నప్పటికీ సర్ విధులు నిర్వరిస్తున్న వారు విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. బీఎల్‌ఓలు వివరాలు ధ్రువీకరించుకుని మరణించి వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నవారి వివరాలు గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపడుతున్నారు.
జోగుళాంబ ఫస్ట్.. నాగర్‌కర్నూల్ లాస్ట్
ఉమ్మడి పాలమూరులోని జిల్లాల వారీగా సర్ ప్రక్రియను పరిశీలిస్తే జోగుళాంబ గద్వాల జిల్లా 87.24 శాతంతో ముందంజలో ఉండగా.. నాగర్‌కర్నూల్ జిల్లా 84.43 శాతంతో చివరన ఉంది. ఇక ఐదు జిల్లాల్లో కలిపి మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, డబుల్ ఓటర్లు, గైర్హాజర్ జాబితాతోపాటు ఇతరులు కలిపి మొత్తం 3,96,927 మంది ఓటర్లు ఉన్నారని తేలింది. గైరాజర్ జాబితాలో ఉన్న ఓటర్ల తరపున ఎన్యూమరేషన్ ఫారాలు అందితే డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. మిగిలిన వారి ఓట్లు మాత్రం ఎస్‌ఐఆర్ పూర్తయ్యాక జాబితాలో ఉండవు. మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, రెండేసీ ఓట్లు ఉన్నవారు, గైర్జాజర్ జాబితాలో అత్యధికంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.
రేపటితో ముగియనున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
85.50 శాతం డిజిటలైజేషన్
వరుస సెలవులు ఉన్నప్పటికీ పూర్తిచేయాలని ఆదేశాలు


