మిషన్ భగీరథతో అరకొరగా తాగునీటి సరఫరా
● పైప్‌లైన్ లీకేజీలతో సమస్య జటిలం
● పలు గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా
● శాశ్వత పరిష్కారంపై
దృష్టిసారించని అధికారులు
మానవపాడు: ఇంటింటా శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన మిషన్ భగీరథ పథకం ప్రజలకు తలనొప్పిగా మారింది. తరచుగా పైపులైన్లు పగిలిపోవడం.. జాయింట్ల వద్ద లీకేజీలతో సరిపడా తాగునీరు అందక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మిషన్ భగీరథ కుళాయిల నుంచి ఒకటి, రెండు బిందెల నీరు మాత్రమే వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది.
పట్టని అధికారులు..
గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. తరచుగా పైప్‌లైన్ల లీకేజీలతో సరిపడా నీరు అందడం లేదని.. సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన పథకంతో ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.


