● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
వనపర్తి రూరల్: నేటి రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన హుందాతనం కనబడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మూడురోజులుగా జరిగిన ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ ముఖఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్ష పార్టీ లు తమకున్న హోదాను మరిచి ఇష్టానుసారంగా తిట్టుకోవడం, అసభ్యంగా విమర్శించుకోవడంతో రాజకీయ విలువలు పూర్తిగా దిగజారే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని జల విధానంపై రాజకీయ విధానాలు కాదని.. జల నిపుణుల విధానం కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటి స్థలం కేటాయించాలని కొన్నిరోజులుగా సీపీఐ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని గుర్తు చేశారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ తదితర పట్టణాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి కూలుస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా అవసరాలు, వారి సమస్యలపై దృష్టి సారించకుండా మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాముడి పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు ఆ దేవుడి సొమ్మును చోరీ చేసిన దొంగలను పట్టుకునే విషయంలో ప్రధాని నోరు విప్పడం లేదని విమర్శించారు. ఒక్కరోజు కూడా అధికారంలో లేకున్నా వందేళ్లు ఒక రాజకీయ పార్టీ సజీవంగా ఉండటం అద్భుతమని.. ఏనాటికై నా దేశంలో అంతిమ విజయం కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. సమానత్వంతో కూడిన సమాజాన్ని సృష్టించే ప్రయాణంలో కూ డా చివరి విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశా రు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలని అన్ని జిల్లాల సమితి సభ్యులు, మండల కార్యదర్శులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు ఎన్‌ఎండీ ఫయాజ్, ఆంజనేయులు, విజయరాములు, బాలకిషన్, నర్సింహ, నాయకులు కేశవులుగౌడ్, వార్ల వెంకటయ్య, నర్సింహ, పట్టణ కార్యదర్శి రమేష్, గోపాలకృష్ణ, శ్రీరాములు ,మహేష్, మోషా, ఎండీ కుతుబ్, సీఎస్ శెట్టి, లక్ష్మీనారాయణ, గోపాల్, ఈర్ల చంద్రమౌళి పాల్గొన్నారు.


