అయిజ: జిల్లాలోని అయిజ మార్కెట్ సబ్ యార్డు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2018 నుంచి కొనసాగుతున్న అయిజ మార్కెట్ సబ్ యార్డులో పశువుల సంత ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచింది. పశువులు, గొర్రెలు విక్రయించడం ద్వారా గత కొన్నేళ్లుగా ఏటా సుమారు రూ.లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత గల యార్డులో ఎక్కడా సరైన వసతులు కనిపించవు. దీనికితోడు సంత నిర్వహించే మైదానంలో మోకాళ్ల లోతు గుంతలు పడ్డాయి. వర్షాకాలంలో మురుగు చేరి దుర్వాసన వెదజల్లుతుంది. పశువుల క్రయవిక్రయాలు మైదానంలో జరిగినా.. గొర్రెల విక్రయాలు మాత్రం మార్కెట్ సబ్ యార్డు పక్కనున్న అయిజ– ఎక్లాస్‌పురం రోడ్డుపై నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.45 లక్షలు మంజూరు చేయడంతో త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నడిగడ్డ ప్రాంతంలో..
నడిగడ్డలో వ్యవసాయ ఆధారంగా జీవించేవారు ఎక్కువగా ఉండడం, రైతులు పంటలు పండించేందుకు సంప్రదాయపరంగా ఎద్దులను ఉపయోగించడం, వ్యవసాయ అనుబంధంగా పాడితోపాటు సేంద్రియ ఎరువుల కోసం పశువులను పెంచడంతో ఈ ప్రాంతంలో పశువుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాటి క్రయవిక్రయాలకు అయిజ మార్కెట్ సబ్ యార్డులో 2018 అక్టోబర్ 18న పశువుల సంత ఏర్పాటు చేశారు. సంతను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఐదేళ్లపాటు గొర్రెలు, మేకలు ఒక్కొక్క దానికి రూ.10, ఆవులు, గేదెలు, ఎద్దులకు రూ.50 చొప్పున విక్రయ రుసుం వసూలు చేశారు. ఆ తర్వాత 2023 సంవత్సరం నుంచి పశువులను విక్రయించిన ధరలో నూటికి రూ.1 చొప్పున కొనుగోలుదారుతో వసూలు చేస్తున్నారు.
మార్కెట్ సబ్ యార్డుకు నిధులు మంజూరు
వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.45 లక్షలు కేటాయింపు
త్వరలోనే టెండర్ల ప్రక్రియకు చర్యలు
సబ్ యార్డు ఆవరణలోనే పశువుల సంత నిర్వహణ
ఆధునిక వసతులు
కల్పించాలంటున్న రైతులు


