నిందితులకు శిక్ష పడాలి | - | Sakshi
Sakshi News home page

నిందితులకు శిక్ష పడాలి

Jul 2 2026 2:23 AM | Updated on Jul 2 2026 2:23 AM

గద్వాల క్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌ చక్రవర్తిని బుధవారం ఎస్పీ శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని నమోదైన పలు కేసులపై మాట్లాడారు. కేసుల నమోదుతోపాటు నిందితులకు శిక్ష పడేలా అ ధికారులు వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసేలా చూడాలని న్యాయమూర్తి ఎస్పీకి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ జాప్యం కనబర్చకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.

మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు కృషి

ధరూరు: మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద అన్నారు. బుధవారం ధరూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళా శాలలో ‘నిషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌– వికసిత్‌ భారత్‌కి పెహచాన్‌’ వారోత్సవాల సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్ర మ రవాణా నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి ఒక పెద్ద శాపమని, ముఖ్యంగా పిల్లలు, యువత భవిష్యత్‌ను తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. మత్తు పదార్థాల వ్యసనం వల్ల కుటుంబాలు ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం, ఐక రాజ్య సమితి మాదక ద్రవ్యాలు, నేరాల కార్యాలయం (యూఎన్‌ఓడీసీ) ప్రకటించిన బ్రేక్‌ ది సైకిల్‌– స్టాప్‌ ఆర్గనైజ్డ్‌ క్రైం అనే థీమ్‌తో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. అనంతరం ప్రొజెక్టర్‌ ద్వారా వీడియోలు చూపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపనకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

సర్వీస్‌ పెన్షన్‌

సాధించడమే లక్ష్యం

గద్వాల న్యూటౌన్‌: సర్వీస్‌ పెన్షన్‌ సాధించడమే తమ అంతిమ లక్ష్యంగా పోరాటం చేస్తామని టీఎస్‌ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్‌జీఓ భవనంలో నిర్వహించిన యూనియన్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్‌ హక్కుల సాధన కోసం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సీపీఎస్‌ రద్దే ధ్యేయంగా వచ్చే నెలలో జిల్లావ్యాప్తంగా జనజాగరణ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఈ యాత్ర విజయవంతం చేసేందుకు ‘సామాజిక భద్రత– మన జన్మ హక్కు’ నినాదంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో చైతన్యం తేవాలన్నారు. ప్రతి మండలంలో యూనియన్‌ సభ్యత్వ నమోదు పెంచాలన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతర కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు బుచ్చన్న, రాష్ట్ర సహధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి, ఎల్లస్వామి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, పరశురాముడు, పుట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కొత్తకోట రూరల్‌: మోజర్ల ఉద్యాన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రా డ్యుయేట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల అసోసియేట్‌ డీన్‌ వీణ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. బైపీ సీ విద్యార్థుల కోసం నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశా లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని.. ఈ నెల 29లోగా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని.. దరఖాస్తుల సమర్పణకు 30 వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తులోని వివరాల సవరణకు ఆగస్టు 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత గల విద్యార్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ skltghu.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. పూర్తి వివరాలకు 89771 29027, 76830 53157 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement