అలంపూర్ రూరల్: వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ చట్టాన్ని అమలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా మూడు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరిగిందన్నారు. వీబీజీ రాంజీ చట్టం అమలుతో దేశంలో 30 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతారని, పని అడిగే హక్కును సైతం కోల్పోతారని, వ్యవసాయ కూలీలు మళ్లీ వలస పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం తర్వాత పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడంతో కార్మికుల ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు, పని పరిస్థితులు, సంక్షేమ ప్రయోజనాలు ఒక దెబ్బతో నిర్వీర్యం చేసేందుకే ఈ కోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, సంక్షేమ చర్యలను కూడా ప్రమాదంలోకి నెట్టి వేస్తుందని, విద్యుత్ ప్రైవేటీకరణ పేరుతో ప్రజలపై మరో కొత్త భారాన్ని మోపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బుధవారం నుంచి అమలవుతున్న వీబీజీ రాంజీ, విద్యుత్ రంగ విభజన, ప్రైవేటీకరణ చట్టాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏమెలమ్మ, వెంకటస్వామి, ఏలియా తదితరులు పాల్గొన్నారు.


