‘నీరు’గారుతున్న లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

‘నీరు’గారుతున్న లక్ష్యం

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

జూరాల సమాంతర కాల్వ షట్టర్లకు లీకేజీలు

నిత్యం 150 క్యూసెక్కుల నీరు వృథా

ఏడాది పొడవుగా పారుతున్న వైనం

జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం

నిధులున్నా.. మరమ్మతులు కరువు

అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల లీకేజీలతో సాగునీరు నిత్యం వృథాగా పారుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా జలాశయం వెనుక జలాలు కాల్వ వెంట వృథాగా పారుతుండటంతో ఆయకట్టు రైతులు, ప్రాజెక్టుపై ఆధారపడిన గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వానాకాలం వచ్చినా.. ఎగువన వర్షాలు కురవకపోవడంతో జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందుతుందో లేదోన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీటినైనా సంరక్షించుకునే ప్రయత్నాలు అధికారులు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా చుక్కనీరు కూడా ముందుకు పారకుండా అడ్డుకట్ట వేసిన ప్రాజెక్టు అధికారులు సమాంతర కాల్వ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జలాశయానికి ఎగువ నుంచి వెయ్యి, 1,500 క్యూసెక్కుల వరద వస్తుండటంతో సమాంతర కాల్వ నుంచి భీమా ఫేజ్‌–2కు నీటిని తరలిస్తున్నా.. జూరాల ప్రాజెక్టు అధికారులు మాత్రం కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదలలేని పరిస్థితులు నెలకొన్నాయి.

మరమ్మతులు కరువు..

సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల లీకేజీ కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథాగా పారుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. 5 ఏళ్లుగా ఇదేతంతు కొనసాగుతున్నా.. మరమ్మతులు చేపట్టి నియంత్రణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి వేసవిలో వరదలు లేకపోయినా షట్టర్ల లీకేజీతో పాటు అధికారుల అత్యుత్సాహం కారణంగా 15 రోజులకోసారి మూడురోజుల పాటు షట్టర్లు తెరిచి ఉన్న నీటిని తరలించుకుంటున్నారని.. జూరాల అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

17 కిలోమీటర్ల పొడవు..

జూరాల జలాశయం ఎడమ కాల్వకు సమీపంలో సమాంతర కాల్వ నిర్మించారు. ప్రాజెక్టు నుంచి రామన్‌పాడు రిజర్వాయర్‌ వరకు 17 కిలోమీటర్ల పొడవునా కాల్వ నిర్మించారు. అమరచింత, ఆత్మకూర్‌ మండలాల మీదుగా కాల్వ రామన్‌పాడు రిజర్వాయర్‌కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి భీమా ఫేజ్‌–2, కొల్లాపూర్‌ వరకు పారుతూ అక్కడక్కడ నిర్మించిన రిజర్వాయర్లు, చెరువులు, నీటికుంటలు నింపి మళ్లించుకుంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement