మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు వందల సంఖ్యలో జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్లు.. మంగళవారం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే జరిగాయి. మక్తల్, అలంపూర్, ఆత్మకూర్, కొల్లాపూర్, అచ్చంపేట రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం అందించే కార్యాలయాల్లో లావాదేవీలు జరగక వెలవెలబోయాయి. ఒక్కసారిగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త స్లాట్ బుకింగ్‌లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ వంటి కీలక ఆన్‌లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజూ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 550 నుంచి 650 మధ్య రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మంగళవారం 74 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి.
స్పష్టత కరువు..
ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న క్రయ, విక్రయదారులకు పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరింపబడతాయనే అంశంపై ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. జూన్ 26 నుంచి 28 వరకు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ సోమవారం సైతం కార్యాలయాల్లో తిరిగి మళ్లీ అదే సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం అందించే కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో క్రయ, విక్రయదారులు విస్తుపోతున్నారు.
గద్వాల 9
మహబూబ్‌నగర్ 8
జడ్చర్ల
8
వనపర్తి 3
కల్వకుర్తి
18
నారాయణపేట 11
నాగర్‌కర్నూల్ 17
మక్తల్, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, ఆత్మకూర్ – 0
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపు
పదుల సంఖ్యల్లో మాత్రమే దస్తావేజులు
క్రయ, విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
చేస్తున్నారు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమే. కానీ సర్వర్లలో నెలకొన్న సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మరింత సులువుగా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తుండటంతోనే కొంత అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి.
– డి.ఫణిందర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్లు ఇలా..


