ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి కృషి

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

గద్వాలన్యూటౌన్‌: ఇందిరమ్మ రాజ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు సేవకులుగా పనిచేస్తేనే ప్రజాపాలనకు సార్థకత ఉంటుందన్నారు. ముఖ్యంగా భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా.. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో పేదలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన వరి వంగడాలనే రైతులు సాగుచేసేలా ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. క్లస్టర్ల వారీగా ఏఈఓలు తమ పరిధిలోని రైతులకు వ్యవసాయశాఖ సమాచారాన్ని చేరవేసేందుకు రైతుల ఫోన్‌ నంబర్లతో వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆర్డీఎస్‌ పరిధిలోని మల్లమ్మకుంట రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 4 – 5 టీఎంసీలకు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకుముందు 9 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను మంత్రి పంపిణీ చేశారు.

● కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, సిబ్బంది మెరుగైన పనితీరు కనబరిచేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. పలు చోట్ల విత్తన మేళాలను నిర్వహించి.. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించామని తెలిపారు.

● ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రూ.10కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ఆడిటోరియానికి అదనపు నిధులు మంజూరు చేయించి, త్వరలోనే ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. అమృత్‌ పథకంలో చేపట్టిన పనుల్లో మొదట పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సంస్థ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ.. మండలాల్లో జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్‌ నీలి శ్రీనివాసులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు హనుమంతు, దొడ్డప్ప, అదనపు కలెక్టర్లు మధుమోహన్‌, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement