అయిజ: ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో వందశాతం పూర్తిచేయడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించమని డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి అన్నారు. మంగళవారం అయిజ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వైద్యసేవలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక బుడుగజంగాల కాలనీలో పల్స్‌పోలియో నిర్వహణపై ఆరా తీశారు. పీహెచ్‌సీ సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన విధానాన్ని కాలనీవాసులతో తెలుసుకున్నారు. పోలియో చుక్కలు వేయించుకోకుండా ఎవరైనా మిగిలి ఉంటే, వారికి వెంటనే చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.
వేరుశనగ @ రూ.7,400
గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 507 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,400, కనిష్టంగా రూ. 4,256, సరాసరి రూ. 5,866 ధరలు లభించాయి. క్వింటా ఆముదాలు రాగా.. రూ. 1,819 ధర వచ్చింది. క్వింటా వరి (సోన) రాగా.. రూ. 2,356 ధర లభించింది.
గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి : సీపీఎం
వనపర్తి రూరల్: గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. పెబ్బేరులో నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను సందర్శించి సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, డి.బాల్‌రెడ్డి, రాజు, జీఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌ఎన్ రమేష్, మేకల ఆంజనేయులు, ఎస్.రాజు, మహబూబ్‌పాషా, గోపాల్‌దిన్నె, తెల్లరాళ్లపల్లి సర్పంచులు దొడ్ల కవిత, జంబులయ్య, అమరచింత మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు అజయ్, సీపీఎం మండల నాయకులు పాల్గొన్నారు.


