మాతృదేవోభవ.. | - | Sakshi
Sakshi News home page

మాతృదేవోభవ..

Jun 30 2026 2:35 AM | Updated on Jun 30 2026 2:35 AM

గర్భిణుల నమోదు నుంచే వైద్యుల పర్యవేక్షణ

అత్యవసర సమయాల్లో జిల్లా ఆస్పత్రికి రెఫర్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగుపడిన వైద్య సదుపాయాలు

జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గుముఖం

గద్వాల క్రైం: జిల్లాలో మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. గర్భిణుల నమోదు నుంచి మొదలుకొని కాన్పు అయ్యే వరకు ప్రత్యేక దృష్టిసారిస్తోంది. అందులో భాగంగా గర్భిణులకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గతంలో ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు సకాలంలో వైద్యం అందకపోవడం.. వైద్యుల కొరత కారణంగా మాతాశిశు మరణాల రేటు అధికంగా ఉండేది. 2024లో 8మంది బాలింతలు, 89 శిశువుల మరణాలు చోటు చేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 9మంది శిశువుల మరణాలు సంభవించాయి. జిల్లాలో మాతాశివు మరణాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి.. మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా క్రమేణా మాతాశిశు మరణాల రేటు తగ్గుతోంది. మరోవైపు జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్‌ కళాశాల ఏర్పాటుచేసి.. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, గైనకాలజిస్టులు, స్టాఫ్‌ నర్సులతో సేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య పరీక్షల కోసం అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో గర్భిణులు, నవజాత శిశువులకు అవసరమైన ఐసీయూ, కేఎంసీతో పాటు అన్ని విభాగాలను ఏర్పాటుచేసి, వైద్యసేవలను మెరుగుపర్చింది. గద్వాల, ధరూరు, గట్టు, అలంపూర్‌, అయిజ, మానవపాడు తదితర ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

వైద్యసేవల్లో జాప్యం లేకుండా..

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, అత్యవసర చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారు. ఆ వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వాట్సప్‌ గ్రూప్‌లో గర్భిణుల వివరాలు, వారు పడుతున్న ఇబ్బందులు, అందించాల్సిన వైద్యం వివరాలను తెలియజేస్తున్నారు. తద్వారా గైనిక్‌ హెచ్‌ఓడీ, చిన్నపిల్లల విభాగం సిబ్బంది వెంటనే అప్రమత్తమవుతున్నారు. గర్భిణి రాగానే సకాలంలో వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో కూడా వైద్యం అందించలేని పరిస్థితి ఉంటే, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, కర్నూలు ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

విపత్తు సమయంలో విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వీ పాటిల్‌ సూచించారు.

–8లో u

నమోదు నుంచే..

మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చే వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్నారు. వారిని ఆస్పత్రులకు ప్రతినెలా తీసుకొచ్చి టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేయించి.. రక్తహీనత అధిగమించేందుకు అవసరమైన మందులను ఇప్పించడంతో పాటు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నెలలు నిండగానే ప్రభుత్వం ఏర్పాటుచేసిన 102 వాహనంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు. కాన్పు జరిగిన అనంతరం తల్లీబిడ్డను ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి చేరవేస్తున్నారు. నిత్య పర్యవేక్షణతో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గుతుందని వైద్యారోగ్యశాఖ చెబుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement