గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ గ్రామాలకు చెందిన 15మంది పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా.. సానుకూలంగా స్పందించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
విద్యార్థుల సామర్థ్యాలు వెలికితీయాలి: డీఈఓ
మానవపాడు: విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని బోరవెల్లి, పల్లెపాడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో సోమవారం ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం పరిశీలించడంతో పాటు తరగతుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలను రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ వెంట ఎంఈఓ శివప్రసాద్ ఉన్నారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి
అలంపూర్ రూరల్: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మున్సిపల్ కమిషనర్ రాజేశ్ అన్నారు. అలంపూర్‌లోని మెప్మా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పట్టణ మహిళా సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలతో చిన్నచిన్న వ్యాపారులను ప్రారంభించేలా మెప్మా సిబ్బంది ప్రోత్సహించాలని సూచించారు. వ్యక్తిగత వ్యాపారాలతో పాటు సంఘం సభ్యులంతా కలిసి పెద్ద వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. మున్సిపాలిటీలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో టీఎంసీ శ్రీకర్ ఉన్నారు.
కనులపండువగా
ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలో సోమవారం పౌర్ణమిని పురస్కరించుకొని ఆదిశిలావాసుడి కల్యాణోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు మధుసూదనాచారి, రవిచారి, శశాంక స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు చేశారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఈఓ సత్యచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రావు, రాముడు, సిబ్బంది రంగనాథ్, శ్రీను, ఉరుకుందు, చక్రి, కృష్ణ, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.
పీయూలో
కొనసాగుతున్న పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో బీపెడ్ మొదటి సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 8వ సెమిస్టర్, బీఫార్మసీ 6 సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈమేరకు పరీక్షలను కంట్రోలర్ ప్రవీణ, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి తనిఖీ చేశారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఇన్విజిలేటర్‌లకు సూచించారు.


