గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు పోరాడి సాధించుకున్న 72 జీఓ ప్రకారం జూరాల ఎగువ నుంచి పీఆర్‌ఎల్‌ఐకు లిఫ్ట్ పనులు చేపట్టాలన్నారు. డిండి లిఫ్ట్ పేరుతో చేస్తున్న అక్రమ పనులు నిలిపివేసి.. పీఆర్‌ఎల్‌ఐ నీటిని తరలించే విధానం ఆపాలన్నారు. నల్లగొండ జిల్లా భూములకు అవసరమైన నీటిని కృష్ణానది మీద అత్యంత పెద్దదైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి గొట్టిముక్కల లిఫ్ట్ చేపట్టి తీసుకోవాలన్నారు. అదే విధంగా గోకారం, గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదన ఆపాలన్నారు. వరద జలాల పేరుతో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లను సత్వరం పూర్తి చేయడంతో పాటు వీటికి నికర జలాలు సాధించాలన్నారు. జస్టిస్ బచావత్, రాజారావు కమిటీలతో నికర జలాల కేటాయింపులున్న ఆర్డీఎస్, జురాల, భీమా–1, 2, కోయిల్‌సాగర్ పథకాలకు నీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించే విధంగా పూర్తి చేయాలని కోరారు. చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపోతల, వెల్టూరు, గొందిమల్ల బ్యారేజ్, జూరాల–గట్టు ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తిచేయాలన్నారు. తుంగభద్ర ఎడమ కాల్వను తెలంగాణలోకి పొడగించి.. కృష్ణా–తుంగభద్ర నదుల నడుమ నడిగడ్డకు గ్రావిటీతో నీరివ్వాలన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి, ఆర్డీఎస్ ఆనకట్టను సుంకుసుల ప్రాజెక్ట్‌లా ఆధునికీకరించాలని అన్నారు. కార్యక్రమంలో యూఎంపీపీఎస్ జేఏసీ చైర్మన్ వీరభద్రప్ప, కన్వీనర్ ఆలూరు ప్రకాశ్‌గౌడ్, రామ్మోహన్, వినోద్‌కుమార్, విజయభాస్కర్‌రెడ్డి, సుభాన్, ప్రభాకర్, నాగన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


