ఆర్థిక చేయూత.. అందని ద్రాక్షేనా? | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక చేయూత.. అందని ద్రాక్షేనా?

Jun 30 2026 2:35 AM | Updated on Jun 30 2026 2:35 AM

ఈఆర్‌ఎస్‌కు దివ్యాంగుల ఎదురుచూపులు

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

నెలలు గడిచినా ఫలితం శూన్యం

ఉమ్మడి జిల్లాలో 120 మంది లబ్ధిదారులు

వనపర్తి: దివ్యాంగుల ఆర్థిక బలోపేతానికిగాను ప్రభుత్వం అమలు చేస్తున్న ఈఆర్‌ఎస్‌ (ఎకనామిక్‌ రిహాబిలిటేషన్‌ స్కీం) ఏడాది కాలంగా డోలాయమానంలో పడినట్లయింది. క్షేత్రస్థాయిలో ప్రక్రియ షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతున్నా.. వందశాతం రాయితీతో వచ్చే ఆర్థిక చేయూతకు రాష్ట్ర ఖజానా గేట్లు మూసివేసింది. గతేడాది ఆగష్టులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి మండల, జిల్లాస్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 2026, ఫిబ్రవరిలో నిధుల మంజూరుకు ట్రెజరీకి టోకెన్లు పంపించారు. 2026 ఏడాదికిగాను దరఖాస్తు చేసుకునే సమయం వచ్చినా.. లబ్ధిదారుల చేతికి మాత్రం నేటికీ డబ్బులు అందలేదు. అసలు ఏమైంది.. లోపం ఎక్కడుందనే విషయం తెలియక అమాయకులైన దివ్యాంగులు ప్రతి సోమవారం ప్రజావాణికి, ఇతర రోజుల్లో డీడబ్ల్యూఓ కార్యాలయాలకు ప్రదక్షిణలు చేయడం తప్పా నెలలు గడుస్తున్నా చేకూరిన ప్రయోజనం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మండలాలు, మున్సిపాలిటీల సంఖ్య ప్రకారం లబ్ధిదారుల సంఖ్య 120కి పైగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

పథకం ముఖ్య ఉద్దేశం..

40 శాతం కంటే ఎక్కువ వికలత్వం.. 21 ఏళ్ల నుంచి 55 మధ్య వయసు వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్‌ఎస్‌ అమలు చేస్తోంది. మున్సిపాలిటీ, మండలానికి ఒకరు చొప్పున వారి కుటుంబ పరిస్థితుల ఆధారంగా మండల, జిల్లా కమిటీల నిర్ణయం మేరకు వందశాతం రాయితీపై గరిష్టంగా రూ.50వేల రుణం మంజూరు చేస్తారు. ఈ రుణంతో ఆ కుటుంబం టైలరింగ్‌, మొబైల్‌ రిపేరు, డెయిరీ, కంప్యూటర్‌ సెంటర్‌, ఇతర చిన్న తరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement